ఏపీ-తెలంగాణా బోర్డర్లో చెక్ పోస్టులు.. ఏపీ ధాన్యానికి తెలంగాణాలోకి నో ఎంట్రీ.. ఎందుకంటే!!
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోమారు ధాన్యం పంచాయితీ కొనసాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న ధాన్యం లారీలను తెలంగాణ అధికారులు అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే వాటిని నిలిపివేస్తున్నారు. దీంతో ఏపీ నుండి ధాన్యం తరలిస్తున్న వారు తెలంగాణా అధికారుల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ తెలంగాణా అధికారులు ధాన్యం తెలంగాణాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే..

ఏపీ ధాన్యం వాహనాలను అడ్డుకుంటున్న తెలంగాణా అధికారులు.. ఏపీ రైతులకు షాక్
ఆంధ్రా ప్రాంతం నుంచి ధాన్యం లోడ్‌తో వచ్చే వాహనాలను తెలంగాణలోకి రాకుండా వాడపల్లి, అడవిదేవులపల్లి, నాగార్జున సాగర్ ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసు, రెవిన్యూ అధికారులతో తనిఖీలు చేపట్టారు. ఆంధ్రా ప్రాంతం నుండి వస్తున్న ధాన్యం వాహనాలను అడ్డుకుంటున్నారు. ఆంద్రాలో కన్నా తెలంగాణాలో ధాన్యంకు మంచి ధర వస్తుండటంతో అక్కడి వ్యాపారులు తమధాన్యాన్ని తెలంగాణాకు తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణా ప్రాంత రైతాంగం ఆంధ్రా ప్రాంతాల నుండి వస్తున్న ధాన్యం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ కలెక్టరేట్ సమీపంలో చెక్ పోస్టులు ... ఏపీ ధాన్యానికి నో ఎంట్రీ
ఇక దీనిపై దృష్టి సారించిన అధికారులు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ సరిహద్దులో చెక్ పోస్టుల ఏర్పాటుకు ఆదేశించారు. ఇక చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన అధికారులు ఏపీ నుండి వస్తున్న ధాన్యం వాహనాలను వెనక్కు పంపిస్తున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి ప్రాధాన్యం ఇచ్చేందుకే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతిని అనుమతించడం లేదని అధికారులు చెప్తున్నారు. ఆమేరకు రెండురోజులుగా రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచిన అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం లారీలను అనుమతించేది లేదని తెలంగాణ పోలీసులు తేల్చి చెబుతున్నారు.

ధాన్యం లారీలను అడ్డుకోవటంపై ఏపీ రైతుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా రాష్ట్రానికి తీసుకు వస్తున్న ధాన్యాన్ని అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న ఆంధ్రా రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారమే తాము ధాన్యం విక్రయిస్తున్నామని వారు తేల్చి చెప్తున్నారు. అయినా అకారణంగా అధికారులు అడ్డుకుంటున్నారని వారంటున్నారు. వే బిల్లులు తోపాటు అన్ని సక్రమంగా ఉన్నా సరే ధాన్యం లారీలను అడ్డుకోవడంపై ఏపీ నుండి ధాన్యం తరలిస్తున్న వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications