ఎమ్మెల్యే పై దాడికి యత్నం, నేతల నిలదీత.. బాధితుల ఆగ్రహావేశాలు..!!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. 20 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. గాయ పడిన వారికి హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. ఘటనా స్థలికి వెళ్లిన ప్రజా ప్రతినిధులను బాధిత కుటుంబ సభ్యుల నుంచి నిరసన వ్యక్తమైంది. స్థానిక ఎమ్మెల్యేను తరిమేసారు. ఇతర పార్టీల ప్రతినిధుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పరిస్థితి పైన నిలదీసారు.
చేవెళ్ల బస్సు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డారు. స్థానిక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజకీయ నాయకులను మృతుల కుటుంబ సభ్యులు నిలదీశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరుకున్నారు. దీంతో వారిని చూసిన మృతుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా.. ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని మండిపడ్డారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా నిరసన సెగ తగిలింది. పోలీసులు నిరసనకు దిగిన వారికి నచ్చ చెప్పారు. ఎంతో కాలంగా రోడ్ల గురించి చెబుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.

అదే విధంగా మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన స్థలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. బస్సును ఇక్కడ నుంచి తొలగించవద్దని మండిపడ్డారు. అయితే.. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యపై స్థానికులు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఎమ్మెల్యే తన కారు ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అధికారకంగా వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మృతల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ ఘటనా స్థిలికి రానున్నారు. క్షతగాత్రులను పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications