తమ్ముడితో కలిసి నడిచే అవకాశాలు లేవు, కానీ...: చిరంజీవి
రాజకీయాల్లో తన తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రయాణిస్తారా అనే ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. సమీప భవిష్యత్తులో మాత్రం ఆ అవకాశం లేదన్నారు.
హైదరాబాద్: రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసే అవకాశాలు లేవని కాంగ్రెసు నేత, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తమ విధానాలు వేరని ఆయన అన్నారు. మెగాస్టార్ విత్ రవిప్రకాశ్ అనే టీవీ9 తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన ఆ విషయం చెప్పారు. ఏ సమయంలోనూ ఎప్పుడు కూడా కలిసి పనిచేసే అవకాశాలు లేవా అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
ఏ మాత్రం కలిసి పనిచేసే అవకాశాలు లేవని చెప్పలేను గానీ అలాంటి అవకాశాలు లేవని మాత్రం చెప్పగలనని ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో మాత్రం అలా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు కనిపించడం లేదని చిరంజీవి అన్నారు. సుదీర్ఘమైన భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేనని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా కోసం ఏది చేయాలన్నా కంఠశోషనే అవుతోందని ఆయన అన్నారు. రవి ప్రకాశ్ వేసిన పలు ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానాలే ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడాల్సి ఉందని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రంపై పోరాటం సాగిస్తానంటే తాము పూర్తిగా మద్దతిస్తామని, చంద్రబాబు వెంట ఉంటామని ఆయన చెప్పారు.
ప్రజారాజ్యం సామాజిక న్యాయ సాధన విషయంలో పూర్తి సాఫల్యం సాధించలేదనే ఆవేదన ఉందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, తాను బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎన్నెన్ని సీట్లు ఇచ్చిందీ చెప్పారు. అణచివేతకు గురవుున్నవారికి న్యాయం అందాల్సిన అవసరం ఉందని ఆయన కులాలపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఆయన అన్నారు. నల్లడబ్బు ఎక్కడ రాబట్టారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications