కఠిన చర్యలు తీసుకోండి- కేంద్రానికి చిరంజీవి స్పెషల్ రిక్వెస్ట్..!!
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృష్టిస్తున్న నకిలీ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్ వల్ల సెలబ్రి టీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వనియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ నకిలీ గుర్తింపులకు వ్యతిరేకంగా మరింత పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సాంకేతికతను సృజనాత్మకం గా ఉపయోగించు కోవడాన్ని ప్రోత్సహిస్తూనే, దాని దుర్వినియోగం వల్ల ఎవరికీ నష్టం జరగకుండా పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
మెగాస్టార్ చిరంజీవి కీలక అంశం పై కేంద్రంతో వరుసగా సంప్రదింపులు చేస్తున్నారు. గత కొంత కాలంగా సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి నకిలీ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, వ్యక్తుల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం, డిజిటల్ మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ టెక్నాలజీ ముప్పును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి వినతి పత్రం అందజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహా మేరకు కిషన్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.

అమిత్ షా సూచనల మేరకు
కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల 2 హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో తనయుడు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సమయంలో డీప్‌ఫేక్ ముప్పుపై అమిత్ షాతో చర్చించినట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ అంశాలపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమ న్వయం చేసుకుని ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చిన కిషన్‌రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి పౌరుడి భద్రతతో పాటు, కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను పరిరక్షించడం ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలే తప్ప.. వ్యక్తుల గౌరవానికి భంగం చేయకూడదని తన ఎక్స్ పోస్టులో చిరంజీవి అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల డిజిటల్ భద్రతకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న చిరంజీవి.. ఈ సమస్య కేవలం సినీ ప్రముఖులకు మాత్రమే పరిమితం కాదని వెల్లడించారు.












Click it and Unblock the Notifications
