కాంగ్రెస్ నేత దానం ఇంట్లో పెళ్లికి కేసీఆర్, చిరంజీవి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ కూతురు వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను కేసీఆర్ ఆశీర్వదించారు. వారుకు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ వివాహ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి, మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, నటుడు మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా తదితరులు హాజరయ్యారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్

హైదరాబాదులోని బోయిగూడ ఐడీహెచ్ కాలనీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం సందర్శించారు. పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
పడక గదుల ఇళ్ల నిర్మాణం పైన కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఐడీహెచ్ కాలనీలో శంకుస్థాపన చేసిన సీఎం ఆరునెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
బంగారు తెలంగాణ లక్ష్యంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకమైనదిగా సీఎం భావిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. జూన్ 2 నాటికి ఐడీహెచ్ కాలనీలో నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications