వరదలపై మంత్రి సత్యవతి రాథోడ్ కు సీఎం కేసీఆర్ ఫోన్.. ఏం చెప్పారంటే!!
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ముంపు బాధిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. దగ్గరుండి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులను పరిశీలిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ మోరంచపల్లిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించడాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పర్యవేక్షించారు.
భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న పరకాల చలి వాగును పరిశీలించిన సత్యవతి రాథోడ్ కు కెసిఆర్ ఫోన్ చేసి వరంగల్ జిల్లాలో వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వరద తీవ్రత తగ్గేవరకు జిల్లాలోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని, సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సత్యవతి రాథోడ్ కు సూచించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి కెసిఆర్ కి వివరించిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే పరకాల చలి వాగును పరిశీలించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరకాల చలి వాగు ఉధృతి అంతకంతకు పెరగడంతో ముంపు ప్రాంతాల్లోని బాధితులను తక్షణమే గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వాగులు ఉదృత రూపంలో పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు అటు వైపుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు రాకపోకలు చేయకుండా నియంత్రించాలన్నారు. లోతట్టు రహదారుల వద్ద బారికేడ్లతో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాగు పరీవాహక ప్రాంతాల్లో ప్రజలెవరూ సంచరించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితులపై ఎవరు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా ఇచ్చారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దనారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, సహాయం కావలసినవారు కంట్రోల్ రూమ్ లకు కాల్ చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications