జూఎన్టీఆర్‌ను ఓదార్చిన కేసీఆర్, బాబుకు పరామర్శ: మానసిక ఒత్తిడి.. మోత్కుపల్లి కంటతడి
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ జోషికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఎదురుపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. జూనియర్ ఎన్టీఆర్ తదితరులను పరామర్శించారు.

అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హరికృష్ణ కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు కోరినచోట హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. హరికృష్ణ భౌతికకాయానికి గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Recommended Video

మోత్కుపల్లి కంటతడి
హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కన్నీరుగార్చారు. ఆయనను ఏ దురదృష్టం వెంటాడిందోనని, ఏ పరిస్థితులు ఆయనను ఈ విధంగా నడిపించాయోనని కానీ ఆయన అందరినీ దుఖఃసాగరంలో ముంచి వెళ్లారన్నారు. హరికృష్ణ, ఎంతో ధైర్యంగా ముందుకు సాగే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ఇప్పుడు కన్నుమూయడం బాధాకరమన్నారు.
రాజకీయంగా ఆయన వెనుకబడ్డారని, ఇతర ఎన్నో కారణాల వల్ల ఆయన మానసిక ఒత్తిడికి లోనయ్యారని తాను భావించానని చెప్పారు. ఏమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు హరికృష్ణ భౌతికకాయం
అభిమానుల సందర్శనార్థం సాయంత్రం ఐదు గంటలకు హరికృష్ణ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. సందర్శానార్థం ఇంటివద్దే ఉంచుతారని కూడా అంటున్నారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొయినాబాద్ సమీపంలోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనయుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగినచోటే నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications