రాజకీయ శూన్యత- సొమ్ము చేసుకుంటోన్న కేసీఆర్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి- పొరుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను క్రమంగా విస్తరించుకుంటోంది. దీనికి అనుగుణంగా నియామకాలను చేపడుతోంది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి క్రమంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంటోంది. ఇప్పటికే ఏపీలో అడుగు పెట్టింది. అటు కర్ణాటకలోనూ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లనుపూర్తి చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) హెచ్ డీ కుమారస్వామితో మంతనాలు సాగిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జేడీఎస్ సహకారాన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

జాతీయ రాజకీయాల్లో..
కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కేసీఆర్- దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలపైనా పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు. ఊహించిన దాని కంటే వేగంగా ఏపీలో అడుగు పెట్టింది బీఆర్ఎస్. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులను పార్టీలోకి చేర్చుకుంది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. బీఆర్ఎస్ లో చేరారు.

మహారాష్ట్రపైనా..
పొరుగునే మహారాష్ట్రపైనా దృష్టి సారించారు కేసీఆర్. ఇప్పటికే తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని నాందెడ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన నాందెడ్ లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు కేసీఆర్. బీఆర్ఎస్ లక్ష్యమేమిటనేది వివరించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తామనే విషయంపై స్పష్టత ఇచ్చారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ ను ప్రకటించారు.

రాజకీయ శూన్యత..
మహారాష్ట్రలో రాజకీయ శూన్యత ఏర్పడిందనేది బీఆర్ఎస్ నాయకుల అభిప్రాయం. ఉద్ధవ్ థాకరే సారథ్యంలో ఇదివరకు అధికారంలో ఉన్న శివసేన-కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కుప్పకూల్చిన తరువాత పరిస్థితులు రాజకీయ శూన్యతకు దారి తీశాయని భావిస్తోన్నారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన- బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోదనే అంచనాలో ఉంది. అదే సమయంలో ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన కూడా ఒంటరిగా అధికారంలోకి రాబోదని అంచనా వేస్తోంది.
సొమ్ముచేసుకునేలా..
ఈ రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకోవాలనేది కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా ఆయన శరవేగంగా మహారాష్ట్రలో రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. తాజాగా- బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిని నియమించారు. సీనియర్ రైతు నాయకుడు మాణిక్ కదంను బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications