మునుగోడులో సీఎం కేసీఆర్ బ్రహ్మాస్త్రం - టార్గెట్ బీజేపీ..!!
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 3న మునుగోడు లో ఉప ఎన్నిక పోలింగ్ జరనుగంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో, గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాలను ముమ్మరం చేసాయి. ఇదే సమయంలో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ ఈ రోజు మునుగోడులో భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. కేసీఆర్ సభ కోసం లక్ష మందికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ కు ఉప ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన లెఫ్ట్ నేతలు పాల్గొంటారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో సీఎం కేసీఆర్ ప్రసంగం పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొని ఉంది. దసరా నాడు బీఆర్ఎస్ ప్రకటన తరువాత ఇప్పటి వరకు కేసీఆర్ సభలు నిర్వహించలేదు. తన పార్టీ అజెండాను అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలోనే... టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం తెర మీదకు వచ్చింది. ఈ వ్యవహారంలో బయటకు వచ్చిన అంశాల్లో కొందరు బీజేపీ ప్రముఖుల పేర్లు ఆడియోల్లో ఉన్నట్లుగా లీక్ అయ్యాయి.

దీని పైన టీఆర్ఎస్ నేరుగా బీజేపీని టార్గెట్ చేస్తోంది. టీఆర్ఎస్ వాదనకు ఆప్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం దీనిని కౌంటర్ చేస్తున్నారు. ఈ సమయంలో ఇప్పటికే సేకరించిన వీడియో - ఆడియో ఆధారాలతో ముఖ్యమంత్రి బీజేపీని ఇరుకున పెట్టే విధంగా ప్రజల ముందుకు వస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక ప్రచార వేళ..ఈ అంశం పైన కేసీఆర్ ప్రస్తావన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరో వైపు ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉండటం, ఇప్పటికే నిందితులను రిమాండ్ కు ఆదేశించటంతో దీని పైన స్పందిస్తారా అనేది మరో సందేహం. కానీ, పార్టీ నేతలు మాత్రం మునుగోడు కేంద్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నారంటూ చెబుతున్నారు.
మునుగోడు సభలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగా ఉంటుందని వెల్లడించారు.ఇదిలా ఉండగా.. ఒక ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి. రేపు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా మునుగోడు ఎన్నికల ప్రచార సభ రద్దు అయింది. మునుగోడులో గెలుపు పైన టీఆర్ఎస్ - బీజేపీ రెండు పార్టీలు ధీమాగా కనిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభలో ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది ఆసక్తి పెంచుతోంది.












Click it and Unblock the Notifications