మోడీ మెప్పుకోసమే కెసిఆర్: జీవన్, వరంగల్లో వైసిపి పోటీ వెనుక: ఏపీ టిడిపి నేత
హైదరాబాద్/కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తహతహలాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జీవన్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు.
ప్రధాని మోడీ మెప్పు కోసమే కెసిఆర్ చండీయాగం తలపెట్టారని ఎద్దేవా చేశారు. ఎన్డీయేలో చేరేందుకు కెసిఆర్ ఉత్సాహం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే, ఢిల్లీలోని కేరళ భవన్ పైన దాడి జరిగిందన్న వార్తలపై స్పందించారు. దానిని ఆయన ఖండించారు. లౌకిక భారతంలో ఆహారపు అలవాట్ల పేరిట దాడి సరికాదన్నారు.

వరంగల్లో జగన్ పార్టీ పోటీపై గాలి
వరంగల్ ఉప ఎన్నికల్లో ఓట్లను చీల్చేందుకే వైసిపి పోటీ చేస్తోందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. టిఆర్ఎస్‌ను గెలిపించడమే వైసిపి లక్ష్యమని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు మద్దతిచ్చిందని గుర్తు చేశారు. మెదక్ లోకసభ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయలేదన్నారు.
శబరిమలలో తెలంగాణ భవన్!
ఈ నెల 29న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ర్టాల దేవాదాయ శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా కేరళ దేవాదాయ శాఖ మంత్రితో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం కానున్నారు.
శబరిమలలో తెలంగాణ రాష్ట్ర యాత్రికుల కోసం ఐదు ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరనుంది. కేరళ వారి కోసం హైదరాబాద్ నగరంలో భవనం కట్టిస్తామని సీఎం కెసిఆర్ గతంలో చెప్పారు.












Click it and Unblock the Notifications