సొంత డబ్బులతో కొనిస్తా: కెసిఆర్, గొప్ప సంకల్పం ఉన్న నాయకుడన్న కెటిఆర్
మెదక్: దెబ్బకు దెయ్యం వదలాలని.. ఎర్రవల్లి గ్రామంలో అందరూ డబుల్ బెడ్ రూం ఇళ్లలోనే ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఒకే గదిలో నివాసముంటున్న వారికి మరో వంట గది, హాల్, డెబ్ రూం గదులు ప్రభుత్వం కట్టిస్తుందని అన్నారు. ఆయన శుక్రవారం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో పర్యటించారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఎర్రవల్లి బ్రహ్మాండంగా తయారవ్వాలని అన్నారు. ఇక్కడి భూముల్లో మేలైన పంటలు వేయాలని అన్నారు. గ్రామానికి నీటి వసతి కల్పిస్తామని చెప్పారు. దళిత సోదరులు ఊరి చివర్లో ఉండాల్సిన అవసరం లేదని, మనుషులంతా సమానమేనని అన్నారు.
వృద్ధుల కోసం వారంలో గ్రామంలో కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్యం చెకప్ చేసేందుకు కూడా త్వరలోనే మంచి వైద్యులు వస్తారని తెలిపారు. గ్రామంలో ఉన్నవారందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు. గ్రామంలో ఇప్పుడు ఐక్యత వచ్చిందని, ఇప్పుడు నాయకులంటే నమ్మకం వచ్చిందని అన్నారు. ఇంతకుముందు నాయకులంటే నమ్మకముండేది కాదని అన్నారు.

గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీరు, కరెంటు, ఇళ్లు అన్ని వసతులుంటేనే అది ఎర్రవల్లి అవుతుందని చెప్పారు. తాను కరీంనగర్ జిల్లాలో కూడా పర్యటించాలని చెప్పారు. సర్కారు డబ్బులతోనే ఎర్రవల్లిలో నల్లాలు పెట్టిస్తామని చెప్పారు.
అవసరమైతే తన సొంత డబ్బులతోనే గ్రామంలో ఇంటింటికీ రెండు చెత్త బుట్టలను కొనిస్తానని చెప్పారు. ఓ దాంట్లో తడి, మరో దాంట్లో పొడి చెత్తను వేయాలని సూచించారు. ఆ చెత్తను విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. పరిసరాలను, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
దళితలకు ఇచ్చిన భూములు పంటలకు అనుకూలంగా ఉన్నాయో లేవో పరిశీలించాలని అధికారులను సూచించారు. దరిద్రం మీద, చెత్త మీద యుద్ధం చేయాలని గ్రామస్తులకు సూచించారు. కష్టపడితే దరిద్రం అదే దూరమవుతుందని అన్నారు. అప్పుడే ధనవంతులు అవుతారని చెప్పారు.
గ్రామంలో మోటుల మాటలు వినిపించకూడదని అన్నారు. మోటు మాటలు బంద్ చేయాలని, అపశబ్ధాలు మాట్లాడితే రూ. 50 జరిమానా విధించాలని సూచించారు. సంస్కారం పట్టుబడితే వస్తదని, తలచుకుంటే ఏది సాధ్యం కానిది ఉండదని అన్నారు.
ఎంపి ప్రభాకర్ రెడ్డి రూ. 50లక్షలను, జిల్లా కలెక్టర్ రూ. 25లక్షలను గ్రామాభివృద్ధికి ఇస్తారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. దీనికి ఎంపి, కలెక్టర్ అక్కడే అంగీకారం తెలిపారు. ఆ తర్వాత గ్రామాభివృద్ధికి భూమి విరాళం ఇచ్చిన వారిని, డబ్బు సాయం చేసిన వారిని సిఎం కెసిఆర్ సన్మానం చేశారు.
గొప్ప సంకల్పం ఉన్న నాయకుడన్న కెటిఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆయన తనయుడు, మంత్రి కెటి రామారావు కొనియాడారు. చిత్తశుద్ధి, గొప్ప సంకల్పం ఉన్న నాయకుడు కెసిఆర్ అని కీర్తించారు. వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోము అని స్పష్టం చేయడం ద్వారా కెసిఆర్ తన దృక్పథాన్ని ఘనంగా చాటారని కితాబిచ్చారు.
కోతలు లేని కరెంట్ ఇచ్చి, తద్వారా అసెంబ్లీలో ప్రతిపక్షాలను నోరెత్తకుండా చేసిన ఘనత టిఆర్ఎస్ సర్కారుదేనని ఉద్ఘాటించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మెల్వలపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న కెటిఆర్ పైవిధంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications