గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్.. ఆసియాలోనే ఫస్ట్ !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (Google Safety Engineering Center - GSEC) ను ప్రారంభించారు. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మొదటి సెంటర్ కావడం గమనార్హం. అలానే ప్రపంచ వ్యాప్తంగా ఐదో GSEC గా నిలిచింది. గూగుల్ ఒక ఇన్నోవేటివ్ కంపెనీ అయితే.. తమది ఒక ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని సీఎం అన్నారు. గూగుల్ ప్రపంచాన్ని మార్చిన సంస్థ అని కొనియాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..?
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతుంటే.. డిజిటల్ భద్రత చాలా కీలకమని తెలిపారు. గూగుల్‌తో భాగస్వామ్యంగా విద్య, ఆరోగ్యం, ట్రాఫిక్, భద్రత, మ్యాపింగ్ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచీ ప్రపంచం మారిపోయిందని, నేడు ప్రతి ఒక్కరి జీవితం డిజిటల్ మయం అయిందని చెప్పారు. అయితే డిజిటల్ వాతావరణం భద్రంగా ఉంటేనే ప్రజల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నారు.

గూగుల్ - హైదరాబాద్ సిటీ పాత స్నేహితులు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2007లో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో గూగుల్ తన మొదటి కార్యాలయం ఏర్పాటు చేసిందని.. ప్రస్తుతం 7 వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఉత్తమ పెట్టుబడి గమ్యస్థానం కోసం గూగుల్ లో వెతుకుతుంటే.. మొదటి లింక్ 'హైదరాబాద్' అని వస్తుందన్నారు. ఇది తెలంగాణ రైజింగ్ కు సంకేతమని పేర్కొన్నారు. 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి $3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ప్రత్యేకంగా మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు సీఎం. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గూగుల్ కార్యాలయం సమీపంలోని రెండున్నర ఎకరాల స్థలంలో స్వయం సహాయక సంఘాల మహిళల స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వారికి మార్కెట్ లింకేజులు, ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు గూగుల్ సహకారం అవసరమని చెప్పారు.
LIVE: Hon'ble Chief Minister Sri A Revanth Reddy Launches & Inaugurates Google Safety Engineering Centre (#GSEC) at Divyasree Building, Hitech City Road, Hyderabad https://t.co/5g2Ny7QIDh
— Telangana CMO (@TelanganaCMO) June 18, 2025
యువత కోసం నైపుణ్య విశ్వవిద్యాలయం..
నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ', 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' వంటి నూతన విద్యా విధానాలు తీసుకొస్తుందని సీఎం వివరించారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications