ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ కీలక ప్రతిపాదన..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులుగా రాయలసీమ లిఫ్ట్ పైన రెండు రాష్ట్రాల్లోనూ చర్చ సాగుతోంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. రాయలసీమ లిఫ్టు పైన వివరణ ఇచ్చింది. ఏపీలోని ప్రతిపక్షం సీఎం ను ఈ అంశం లో టార్గెట్ చేస్తోంది. కాగా.. ఇప్పుడు సీఎం రేవంత్ కీలక ప్రతిపాదన చేసారు. తాను వివాదాల కంటే పరిష్కారం వైపే ఆసక్తి చూపుతానని తేల్చి చెప్పారు.
నీళ్ల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. నీళ్ల విషయంలో వివాదాలు, రాజకీయ లబ్ధికోసం ఆలోచన చేయవద్దని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. వివాదాలకు చర్చ ఒక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు వద్ద కాకుండా కూర్చొని పరిష్కరించుకోలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకి పెట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రేవంత్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో హైదరాబాద్ భవిష్యత్ పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని వివరించారు.

హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడుతోందన్న రేవంత్ .. భవిష్యత్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్యూర్, ప్యూర్, రేర్ మీద ఆధారపడిఉందని వివరించారు. ప్రపంచస్థాయి దేశాలతో తెలంగాణ పోటీపడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణ మనరాష్ట్రంలో ఉందని వివరించారు. పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించిందని గుర్తుచేశారు. పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నది మన దేశంవాళ్లేనన్నారు. ఐఏఎస్ కంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎక్కువగా సంపాదిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కొత్త విద్యా పాలసీని తీసుకువస్తామని వెల్లడించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా..." కృష్ణా నదిలో ఉన్న పాలమూరు రంగారెడ్డి, కేఎల్‌ఐ, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు ప్రాజెక్టులు అనుమతులకు అడ్డంకి పెట్టవద్దు... ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులకు సహకరించండి...అని రేవంత్ కోరారు. మాకు సహకరిస్తే మేము కూడా సహకరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications