కేసీఆర్ పై రేవంత్ బ్రహ్మాస్త్రం- నెక్స్ట్ ఇక, రంగం సిద్దం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ సంధించిన తాజా అస్త్రం సంచలనంగా మారుతోంది. కేసీఆర్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల భూముల చిట్టా రేవంత్ బయట పెట్టారు. వీటి లెక్కలు.. గుట్టు తేల్చాలని ఆదేశించారు. అధికారంలో ఉన్న వేళ వీటిని తమ సొంతం చేసుకున్నారని ఆరోపించారు. అటు బీఆర్ఎస్ సైతం కౌంటర్ చేస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో రేవంత్ భారీ ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్ భూముల వ్యవహారం పైన రేవంత్ సుదీర్ఘ కసరత్తు చేసారు. ఆ తరువాతనే అసెంబ్లీ వేదికగా అసలు విషయం బయట పెట్టారు. వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ ఫ్యామిలీ సొంతం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికల అఫిడివిట్ లోనే అన్ని అంశాలను పొందు పర్చారని బీఆర్ఎస్ కౌంటర్ చేస్తోంది. అయితే, రేవంత్ అసెంబ్లీ వేదికగా కీలక అంశాలను బయట పెట్టారు. సత్యం స్కాంలో ఉన్న భూముల్లోనే కేటీఆర్ ఫాంహౌస్ ఉందన్నారు. సత్యం స్కాంలో ఉన్న భూములు.. కేటీఆర్ బంధువుల పేరుతో బదిలీ అయ్యాయని చెప్పారు. సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్ రావు ఫాంహౌస్‌కు రోడ్లు వేయించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌కు తీసుకున్న భూమిలోనే హరీశ్ రావు ఫాంహౌస్ ఉందన్నారు. హైదరాబాద్ బాలానగర్‌లో 120 ఎకరాలను హరీశ్ రావు కుటుంబ సభ్యులు కొల్లగొట్టారని ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు భయపడుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ కు నోటీసుల జారీకి రంగం సిద్దం
ఇదే సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని.. విచారణ జరపకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 30 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు ఎస్సీలను యజమానులుగా చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఫాంహౌస్ ఆధీనంలో 700 ఎకరాలు ఉందని.. ఫాంహౌస్ భూమిని తేల్చాలని కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. 30 రోజుల్లోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి భూమి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని ప్రకటించారు. కేసీఆర్‌కు తక్షణం నోటీసులు ఇచ్చి భూమి స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవాకశం కనిపిస్తోంది. వీటికి కేసీఆర్ సమాధానం... తదుపరి చర్యల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications
