ప్రధాని మోదీకి సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్, అంగీకరించేనా..!?
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం.. పరిస్థితుల పైన నేరుగా ప్రధానికి వివరించాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం ముహూర్తం ఖరారైంది. మంత్రి ఉత్తమ్ తో కలిసి రాష్ట్రంలో కరువు పరిస్థితులను వివరించటంతో పాటుగా ప్రత్యేక ఆర్దిక ప్యాకేజీ పైనా చర్చించనున్నారు. రైతులు, గ్రామీణ కుటుంబాలకు సకాలంలో సాయం అందించ డంపై కేంద్ర సహకారం కోరనున్నారు. దీంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ కీలకంగా మారుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి ఉత్తమ్ తో కలిసి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 15న ఢిల్లీలో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో వర్షపాతం లోటు, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించ నున్నారు. వర్షాభావంతో సాగు, రైతులు, గ్రామీణ జీవనోపాధిపై పడుతున్న ప్రభావం ప్రధాని దృష్టికి తీసుకెళ్లటంతో పాటుగా పూర్తి నివేదికలు అందించనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం నుంచి తగిన నిధులు కోరాలని నిర్ణయించారు. కరువు తీవ్రతను తగ్గించే చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చకు అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థిక సాయం కోరనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులతో ముడిపడిన సమస్యలను నివేదించాలని నిర్ణయించారు. ఎల్ నినో కష్టాల వేళ ప్రధాని మోదీ ఎలాంటి హమీ ఇస్తారనేది కీలకంగా మారనుంది.

సీఎం రేవంత్ కీలక ప్రతిపాదనలు
కాగా, ప్రధానంగా 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-వార్ధా సంగమంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి సమ్మతి ఇప్పించాలని, అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు తగిన అనుమతులు ఇచ్చి.. ప్రధానమంత్రి కృషి సింఛాయ్ యోజన /సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కోరనున్నారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్ గఢ్ నుంచి ఎన్వోసీ ఇప్పించి.. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ(కేంద్ర జలవనరుల సంఘం) నుంచి క్లియరెన్స్‌లు ఇప్పించాలని నివేదించనున్నారు. ఇక గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును సమ్మక్కసాగర్/ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని, ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం వాటాను తెలంగాణకు ఇవ్వాలని కోరనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు సీతారామ, ఇతర పథకాలకు తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ భేటీ పాలనా పరంగా కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications
