ఎల్‌నినో దెబ్బ, కరువు ముప్పు.. పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్!
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన తీవ్ర నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కారు కార్యాచరణ సిద్ధం చేసింది. రాబోయే 8 నుంచి 10 నెలల పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పేద కూలీలను ఆదుకునేందుకు సంక్రాంతి పండుగ తర్వాత మే నెల వరకు ఉద్దేశించిన ఓ కొత్త ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రజా భవన్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రైతులు వర్షాధార పంటలే వేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు వాటి మొత్తం సామర్థ్యంలో 20 శాతం కంటే తక్కువకు పడిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీరు 200 టీఎంసీలకు మించి లేదని, కొన్ని జలాశయాలు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లలో ఇప్పటికే 15 లక్షలు ఎండిపోయాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో సాగునీరు అందించడం అసాధ్యమని, అందువల్ల ప్రాధాన్యత ప్రకారం తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతులు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని, నీటి అవసరం తక్కువగా ఉండే వర్షాధార పంటలు, కూరగాయలను మాత్రమే సాగు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ రైతు వేదిక ద్వారా కరువు పరిస్థితులపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

మే వరకు ఉపాధి హామీ అనుబంధ పథకం
పేద కూలీలు, కార్మికులకు కష్టకాలంలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర సర్కారు భారీగా నిధులు వెచ్చించి సంక్రాంతి నుంచి మే నెల వరకు 4 నెలల పాటు ప్రత్యేక పథకాన్న అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం ద్వారా కాలువలు, చెరువులు, కుంటల పూడికతీతతో పాటు పొలాలకు వెళ్లే బాటలను పునరుద్ధరిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి రాకుండా పశువుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను పెంచుతామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు గ్రామాలు సందర్శించి ఈ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగిస్తామని తెలిపారు.
రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 20,000 మెగావాట్లకు చేరుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎల్‌నినో వల్ల ఏర్పడిన విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ.. మార్కెట్లో విద్యుత్ లభ్యత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను బొగ్గు లభ్యత ఉండే రామగుండం, కొత్తగూడెం కాకుండా దామరచర్లలో నిర్మించడం వల్ల రూ.8,000 కోట్లకు పైగా అదనపు భారం పడిందని, రవాణా ఖర్చులు పెరిగాయని మండిపడ్డారు. ప్రతిపాదిత ప్రాంతంలో ప్రాజెక్టు పెట్టడం వెనుక కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఢిల్లీలో నవంబర్ 1న భారీ ధర్నా
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఓటర్ల తొలగింపు సహా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి.. నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించే భారీ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ నుంచి 15,000 మంది పార్టీ కార్యకర్తలను సమీకరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను గెలిపించేందుకు పార్టీ యంత్రాంగం శ్రమించాలని, అర్హులైన ప్రతి ఒక్కరితో ఓటు నమోదు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.














Click it and Unblock the Notifications
