వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టండి
Revanth Reddy: వర్షాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడేన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయంలో రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాల దందాలపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని చెప్పారు.
రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్లా టాస్క్ ఫోర్స్ నిఘా ఉంచాలని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం హెచ్చరించారు. ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు, ఎక్కడ నిల్వలు ఉన్నాయి.. ఎక్కడ నుంచి రవాణా అవుతున్నాయనే వివరాలన్నీ అధికారులకు సమాచారం ఉందని, ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని అన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని సీఎస్ రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. ఈ సీజన్ లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్ లో అందుబాటు ఉన్నాయని వివరించారు.
ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రైతులకు భరోసానిచ్చారు. ఈ సారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించాలని సూచించారు.
అందుకు అనుకూలంగా సరైన అదనులో పంటలు వేసుకోవాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు ఆయన కోరారు. ప్యాక్డ్ విత్తనాలు తప్ప లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దని, విత్తన పాకెట్లు కొనేటప్పుడు తప్పకుండా బిల్లును, పాకెట్ ను పంట కాలం ముగిసేంత వరకు భద్రపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications