సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం! ధాన్యం తరలింపులో జాప్యమా?
రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని, రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా మిషన్ మోడ్‌లో సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.
ధాన్యం సేకరణలో జాప్యం జరిగితే జిల్లా కలెక్టర్లనే బాధ్యులను చేస్తామని, అవసరమైతే చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని సీఎం స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, హమాలీల కొరత ఉండకూడదని, ధాన్యం లోడింగ్‌కు లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖను ఆదేశించారు. లారీల కొరత ఉంటే స్థానికంగా ట్రాక్టర్లను వినియోగించుకోవాలని సూచించారు.

వివిధ ప్రాంతాల్లో గోడౌన్స్ సమస్య ఉన్నట్లు తెలుస్తోందని, అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రైతుబజార్లు, ఫంక్షన్ హాల్స్‌ను ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్స్‌కు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలాచూడాలని సూచించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అకాల వర్షాల నుంచి రక్షణకు ప్రత్యేక వ్యవస్థ
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాల సమయంలో కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని, వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.
ప్రతీ IKP సెంటర్‌కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ప్రతీ రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలని తెలిపారు.
రైతులకు రశీదు అందేలా
ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచాంరు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.














Click it and Unblock the Notifications