కేబినెట్ సమావేశం- పెండింగ్ హామీల అమలు, ఉద్యోగులకు ఇక...!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతోంది. వచ్చే మూడు నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నికల జాతర. వరుసగా పలు ఎన్నికలు జరగనున్నాయి. 2028 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా రానున్న ఖైరతాబాద్ బై పోల్.. గ్రేటర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. దీంతో.. ఈ రోజు జరుగుతున్న కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
తెలంగాణత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాల(డీఏ)పై చర్చ జరగనుంది. దసరా నుంచి రెండు డీఏలను అమలు చేస్తామని ప్రకటించి న నేపథ్యంలో డీఏలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు వివాదాస్పదంగా మారిన 22ఏ (22A) భూముల సమస్య, సాగునీటి పారుదల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చ జరగనుంది. అలాగే సిరిసిల్లలో పేదలకు నిర్మించిన ఇళ్ల హక్కుల కల్పనపై కూడా మంత్రివర్గం స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇతర రెవెన్యూ శాఖ అంశాలు, సాగునీటి పారుదలపై చర్చించే అవకాశాలున్నాయి. క్యాబినెట్ సమావేశంలో సిరిసిల్లలోని సుందరయ్య నగర్, బద్దం ఎల్లారెడ్డి నగర్, రాజీవ్ నగర్, పద్మానగర్‌లలో ఉన్న ఆరు వేల ఇళ్లకు హక్కులు కల్పించే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

వరుస ఎన్నికలు.. కొత్త వ్యూహాలు
కాగా, కాలనీలు ఏర్పాటై 30-40 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అక్కడుంటున్న వారి ఇళ్లకు సంబంధించి క్రయ విక్రయాలు, వారసత్వ బదిలీ చేసుకునేందుకు అవకాశం లేదు. ఈ మేరకు అక్కడుంటున్న వారి ఇళ్లపై వారికే పూర్తి హక్కులు కల్పించేలా క్యాబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు ఈషా ఫౌండేషన్‌కు కొంత భూమిని కేటాయించేందుకు అవకాశం ఉందని సమాచారం. అధికారిక అజెండా పూర్తయిన తరువాత ప్రస్తుత రాజకీయ అంశాల పైనా సీఎం రేవంత్ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. త్వరలో వరుసగా ఎన్నికలు ఉండ టంతో.. వీటి పైన మంత్రులకు వ్యూహ రచన నిర్దేశించనున్నారు. ఖైరతాబాద్ తో పాటుగా గ్రేటర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను మంత్రులకు అప్పగించనున్నారు. మూడేళ్ల పాలన పూర్తవుతున్న వేళ పెండింగ్ హామీల అమలు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
