"డిసెంబర్ నాటికి ఉస్మానియా ఆస్పత్రి పూర్తి కావాలి"
వచ్చే జూన్ 2 నాటికి అల్వాల్, ఎల్ బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఉస్మానియా నూతన ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు సేవలందించేలా చూడాలన్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖపై ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.
టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణ పనులు, ఆయా ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్స కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. మూడేళ్లలోనే 9 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు.
సనత్ నగర్, అల్వాల్, ఎల్ బీ నగర్ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు సంబంధించి ఏకీకృత విధానం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు టిమ్స్ మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా ఉండాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సీఎం సూచించారు. టిమ్స్ ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హౌస్ కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామన్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలకు వేరే సిబ్బంది ఉంటే, వైద్యులు పూర్తిగా వైద్య సేవలపైనే దృష్టి సారించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.
నిమ్స్ లో శస్త్రచికిత్సలకు సమయం ఎక్కువ తీసుకుంటున్నందున సనత్ నగర్ టిమ్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిమ్స్ లో బెడ్స్ లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా సనత్ నగర్ టిమ్స్ ను వినియోగించుకోవాలన్నారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు నిత్యం సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

టిమ్స్ లో వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి నుంచి వైద్యులను నియమించుకోవాలని, అందుకు అవసరమయ్యే మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. నిర్మాణంలో ఉన్నమరో 79 డయాలసిస్ సెంటర్ల పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications
