ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభం.. సీఎం రేవంత్ చేతుల మీదుగా..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 19 న ప్రారంభించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో భాగంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. సైబరాబాద్- రాచకొండ పోలీస్ కమిషనరేట్స్ రీ ఆర్గనైజేషన్ లో భాగంగా 2025 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషనరేట్ ను ఏర్పాటు చేసింది.
ప్రజలకు శాంతి భద్రతలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కమిషనరేట్ పరిధిలోకి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ల, శంకర్ పల్లి, మోయినాబాద్ తోపాటు ఇతర సమీప ప్రాంతాలు వస్తాయి. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, సీపీ తరుణ్ జోషి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇక తెలంగాణలో పెట్టుబడులు భారీగా వస్తున్న క్రమంలో ప్రాంతీయంగా ఊపందుకుంటున్న పారిశ్రామికాభివృద్ధికి దీటుగా అంతర్జాతీయ స్థాయి ఆధునిక భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇక ప్రస్తుతం సైబర్ నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు, భద్రతా పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతల ప్రత్యేక జోన్లు, విస్తృత ట్రాఫిక్ పోలీసు వ్యవస్థతో పాటుగా మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేకంగా మూడు మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రజల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
