విభజన సమస్యలపై కమిటీ, 2 నెలల్లో కొలిక్కి!: నిలదీయండని కెసిఆర్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన మరింత దృష్టి సారించింది. విభజన సమస్యలను వేగవంతంగా పరిష్కరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు కేంద్రం ఓ కమిటీని వేసింది.
విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున సభ్యులు ఉంటారు.
హోంశాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ కుమార్ కమిటీకి చీఫ్‌గా ఉంటారు. కమిటీలో సభ్యులుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘాల్, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రేమచంద్రా రెడ్డి, తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావులు ఉంటారు.

అలోక్ కుమార్ నేతృత్వంలోని కమిటీ ఈ నెల 26వ తేదీన తొలిసారి భేటీ కానుంది. తొలి సమావేశంలో విధివిధానాలను ఖరారు చేస్తారు. ఈ కమిటీ రెండు నెలల్లో విభజన సమస్యలను కొలిక్కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేయనుంది. కాగా, త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. విభజన సమస్యల పైన, హామీల పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పార్లమెంటులో నిలదీసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టిఆర్ఎస్ ఎంపీలు విభజన హామీలపై నిలదీస్తామని చెబుతున్నారు.
నిలదీయండి: కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు పార్టీ ఎంపీలతో క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. త్వరలో పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వారికి ఆయన దిశానిర్దేశనం చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
విభజన హామీలను నెరవేర్చే విషయమై కేంద్రాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో నిలదీయాలని కెసిఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు. హైకోర్టు, జాతీయ రహదారుల నిర్మాణం, ప్రాజెక్టులకు జాతీయ హోదా పైన లేవనెత్తాలని సూచించారు.












Click it and Unblock the Notifications