అక్రమాలకు అడ్డా ధరణి.!నోట్ల రద్దుతో అయోమయం.!ప్రజల మొగ్గు కాంగ్రెస్ వైపేనన్న భట్టి.!
హైదరాబాద్ : ధరణి తీసుకువచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల రూపాయల విలువైన భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో అత్యున్నత విలువైన భూములను పార్ట్ బి లో పెట్టి ప్రజలకు అర్థమయ్యే లోపు ప్రభుత్వ పెద్దలు చాలా నిశ్శబ్దంగా హాం ఫట్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ధరణి ద్వారా భూమిపై హక్కు కోల్పోయామని ఆదిలాబాద్ నుంచి జడ్చర్ల వరకు తాను నిర్వహించిన పాదయాత్రలో వచ్చిన ప్రజల విజ్ఞాపనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు భట్టి. మిషన్ భగీరథ, కాలేశ్వరంలో కమిషన్ల అవినీతి గురించి ఇన్నాళ్లు ప్రజలు చర్చించుకున్నారని, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అతిపెద్ద భూకుంభకోణం ధరణీ ద్వారా తెలంగాణలో జరుగుతున్నదని భట్టి ధ్వజమెత్తారు.
అక్రమాలకు అడ్డాగా మారిన ధరణి : ధరణి భూ కుంభకోణం రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు భట్టి. భూ కుంభకోణం ద్వారా డబ్బులు పోగు చేసుకున్నారు కాబట్టే.. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే విపక్ష అభ్యర్థులకు అయ్యే ఖర్చు భరించే స్థాయికి చంద్రశేఖర్ రావు ఎదిగారని ఘాటు ఆరోపణలు చేసారు భట్టి. బిఆర్ఎస్ పరిపాలనలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. బలహీన వర్గాల ప్రజలు కులవృత్తులు చేసుకోవడానికి కావలసిన సహాయం చేయడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు భట్టి.

కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు : తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్న బిఆర్ఎస్ కు చరమగీతం పాడటానికి ప్రజలు సమాయత్తమవుతున్నారన్నారు భట్టి. కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి ఆచరించేవారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చని, కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలామంది వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వివిధ రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు చాలామంది తమతో టచ్ లో ఉన్నారని, వారి పేర్లు బయట పెడితే వారిపైన అధికార రాజకీయపరమైన ఒత్తిడి ఉంటుంది కాబట్టి గోప్యంగా ఉంచుతున్నామన్నారు భట్టి విక్రమార్క.













Click it and Unblock the Notifications