గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు- రేవంత్ అనూహ్య ఎంపిక, బీఆర్ఎస్ 'ఫిక్స్'..!!
సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఫిక్స్ చేయటమే టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల అంశాల ను వరుసగా బయట పెడుతున్న సీఎం రేవంత్ టీం.. ఇప్పుడు రాజకీయంగానూ ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం లో రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. రేవంత్ ఎంపిక ఇప్పుడు పార్టీలో ఆసక్తిగా మారుతోంది.
రాష్ట్రంలో వచ్చే నెలలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందు లో ఒక సీటు కోసం రేవంత్ అనూహ్య ఎంపిక దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సీటును తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరు ఖరారు దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ గా ఉన్న పవిత్ర వాణికి ఎమ్మెల్సీ సీటు కేటాయించటం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. మూడు ఎమ్మెల్సీ సీట్లలో ఒక సీటును పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వనున్నట్లుగా సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ఉద్యమకారులతో పాటుగా పద్మశాలి వర్గానికి చెందినవారూ ఓన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడి కుటుంబసభ్యురాలు, పైగా పద్మశాలి సామాజిక వర్గం కావడంతో పవిత్రవాణి పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సిఫారసు చేయటం పైన రేవంత్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ వ్యూహాత్మక నిర్ణయం
కాగా..తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీకి పేరుంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారులను, వారి కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని రేవంత్ ప్రతీ సందర్బంలో టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ సీఎం అయిన తరువాత కోదండరామ్‌ను ఎమ్మెల్సీ చేయటంతో పాటుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి వివిధ కార్పొరేషన్లలో పదవులూ ఇచ్చిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా తీసుకున్నారు. తాజాగా కొండా లక్ష్మణ్ బాపూజీ కూతురు పవిత్రవాణి పేరునూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం ద్వారా బీసీ సామాజిక వర్గాల్లోను, ప్రత్యేకించి పద్మశాలి సామాజిక వర్గంలో.. మహిళల్లో సానుకూలత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తిగా కేసీఆర్ ను ఫిక్స్ చేసేందుకు సరైన అస్త్రంగా రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకం పైన త్వరలోనే నిర్ణయం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
