కాంగ్రెస్-ఎంఐఎం: అక్బరుద్దీన్‌తో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీ అవరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ అవరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది రాజకీయ భేటీ కాదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

అక్బరుద్దీన్‌తో భేటీపై జగ్గారెడ్డి ఇలా.. శ్రీధర్ బాబు అలా
జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం కూడా సెక్యూలర్ అంటుంది కాబట్టే తాము అక్బరుద్దీన్‌ను కలిశామని చెప్పారు. ఎంఐఎంతో మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. మరో నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అక్బరుద్దీన్‌తో జరిగింది రాజకీయ భేటీ కాదని అన్నారు. ఇందులో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడంతో మంచి చెడు మాట్లాడుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ తమతో చెప్పారని తెలిపారు.

ఎంఐఎం అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్ఎస్‌తో
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంఐఎం.. బీఆర్ఎస్ పార్టీకి దగ్గరైంది. పరోక్షంగా మిత్రపక్షంగానే కొనసాగుతోంది.

అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్: కాంగ్రెస్ నేతల భేటీకి ప్రాధాన్యం
అయితే, తాజా బడ్జెట్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్, అక్బరుద్దీన్ మాటల యుద్ధం కొనసాగింది. చర్చలా కాకుండా ప్రసంగం మాట్లతాడుతున్నారని.. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న మీరే ఇంత సమయం తీసుకుంటే.. వందమందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్న తామేంత సమయం తీసుకోవాలని కేటీఆర్ అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో తాము వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. 15 స్థానాల్లో గెలిచి 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తామన్నారు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తో చర్చిస్తామని అక్బరుద్దీన్ చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు అక్బరుద్దీన్‌ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో కొత్త పొత్తు కోసం కాంగ్రెస్ నేతలు ఏమైనా చర్చలు జరిపారా? అనేది తెలియాల్సి ఉంది. ఇరు పార్టీల నేతలు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.












Click it and Unblock the Notifications