ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరి ఇదేనంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని స్పష్టం చేశారు.
చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని సీఎం చెప్పారు. వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఎలాంటి ఇబ్బందులు రాకుండా వర్గీకరణ ప్రక్రియ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. చరిత్రలో తొలిసారి ఓయూ వీసీగా మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెనూ చేంజ్
తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒక విధమైన ఆహారం అందించాలన్న సంకల్పంలో చేపట్టిన కామన్ డైట్ మెనూ నేటి నుంచి ప్రారంభమైంది. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్‌ను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెనూ డైట్ కార్యక్రమం జరగ్గా.. చిలుకూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అక్కడ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ స్కూల్ నుంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన పలువురు విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు బహూకరించారు. అనంతరం పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తున్న సందర్భంగా విద్యార్థుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications