ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
గుజరాత్ లోని సూరత్ లోక్ సభ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ ఏకగ్రీవంగా గెలుపొంది 2024 ఎన్నికల్లో బోణీ కొట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేష్ కుంభానీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ చేసిన సంతకాలు నిజమైనవి కావని, నకిలీవని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆ నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు కూడా తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో బీజేపీ తరఫున బరిలోకి దిగిన ముఖేష్ దలాల్ గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగిన దానం నాగేందర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని చెప్పొచ్చు. తూతూమంత్రంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ తాను గెలుపొందిన తర్వాతే రాజీనామా చేస్తానని ఆయన భీష్మించుకుకూర్చున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసుకోవడంతోపాటు ఒకరిపై మరొకరు విమర్శలు తీవ్రంగా సంధించుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీచేస్తుందా? లేదా? అనే సందేహం అందరిలో కలుగుతోంది.

దానంపై బీఆర్ఎస్ అనర్హత వేటు వేయాలంటూ స్పకీర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించింది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత దానంపై అనర్హత వేటు పడితే ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ పెద్దలకు ఆందోళనగా మారింది. సూరత్ తరహాలో సికింద్రాబాద్ కూడా చేజారిపోతుందా? అనే అనుమానం వస్తోంది. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ దానంను హెచ్చరిస్తున్నారు. ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీ నుంచి పోటీచేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నప్పటికీ దానం మాత్రం మొండికేస్తున్నారు. నేతలను కూడా ఎవరినీ కలుపుకుపోవడంలేదు. దానం అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తే బొంతు రామ్మోహన్ పేరు ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానం నాగేందర్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications