కాంగ్రెస్ విజయం పక్కా.. కేంద్రంలో కూడా.. కొండా లెక్క ఇదీ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మూడ్‌తో నేతలు ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకున్నా.. ఎలక్షన్స్.. రిజల్ట్స్.. అధికారం అని నేతలు తరచుగా కామెంట్ చేస్తున్నారు. దీనికి తగినట్టు ముఖ్య నేతల చర్యలు ఉంటున్నాయి. కాంగ్రెస్ నేత కొండా సురేఖ కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తోందని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారం చేపడుతామని ధీమా వ్యక్తం చేశారు.

లేని విలువలు..
కొండా దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'కొండా' మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి సురేఖ విజయవాడ వచ్చారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేటి రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి ఆమె మాట్లాడారు. నిజ జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకే 'కొండా' సినిమా తీశాం.
నక్సల్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా సినిమా రూపొందింది. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాం. నేటి రాజకీయాల్లో విలువలు లేవు. బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. కొండా సినిమా ప్రమోషన్లలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాం అని ఆమె చెప్పారు.

రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే
వైఎస్సార్ రాజకీయ భిక్షతో ఈ స్థితిలో ఉన్నామని సురేఖ చెప్పారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కలిసింది లేదు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేశాక షర్మిలమ్మ, విజయమ్మతో కోర్టుకు హాజరయ్యాను.
అప్పుడే వాళ్లతో మాట్లాడాను. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని కలిసింది లేదు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అక్రమ కేసులు
వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నానని తెలిపారు. టీడీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టారు. నక్సలైట్లతో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే అణచి వేస్తున్నారు. తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టీఆర్ఎస్ నేతల ఆగడాలు సాగేవి కావు. నక్సలైట్ల హయాంలో తెలంగాణ బాగుండేది. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ పార్టీ లాక్కుంది. నక్సల్ ఉద్యమం చేసినప్పుడు ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని కొండా సురేఖ గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications