కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్: దరఖాస్తులు చేసుకోండి, ఏ వర్గ అభ్యర్థి ఎంత చెల్లించాలంటే?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్.. పోటీ చేసే అభ్యర్థులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత మొట్టమొదటిసారి ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు రెండూ కలిసి కట్టుగా గాంధీభవన్‌లో సమావేశమయ్యాయి.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసీ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిఘ్నేష్ మేవాని, బాబా సిద్దిఖీలు పాల్గొన్నారు. ముఖ్య నాయకులంతా పాల్గొన్న ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌తో పాటు ఇద్దరి సభ్యులను సమావేశానికి హాజరైన నేతలకు పరిచయం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉండాలి? కర్ణాటకలో అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది? ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే తదితర అంశాలపై సీనియర్ల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ), స్క్రీనింగ్ కమిటీలు నిర్ణయించాయి.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును తెలంగాణ కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 18 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.
ఓసీ అభ్యర్థులైతే రూ. 50 వేలు, బీసీలైతే రూ. 25 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుము లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ముందుగా దరఖాస్తులను పరిశీలించి టికెట్లను కేటాయిస్తారని తెలుస్తోంది. ఇలా దరఖాస్తులు చేసుకున్నవారు పార్టీకి నిధులు ఇచ్చినట్లే అవుతుంది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి దాదాపు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువగానే ఈ సంఖ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీకి నిధులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు భారీగా వస్తే ఎంపిక ఎలా ఉంటుందనేదానిపైనా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications