ఎండలో ట్రైనింగ్: వరంగల్‌లో హెడ్ కానిస్టేబుల్ బుచ్చిరెడ్డి మృతి
హైదరాబాద్: వరంగల్ సమీపంలోని మామునూరు పోలీస్ శిక్షణా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఎండలో శిక్షణ పొందుతూ ఓ హెడ్ కానిస్టేబుల్ గుండె పోటుకు గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... హెడ్ కానిస్టేబుళ్లకు ప్రతి ఏడాది నిర్వహించే శిక్షణా తరగతుల్లో భాగంగా మామునూరు పీటీసీలో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన పలువురు హెడ్ కానిస్టేబుళ్లు హాజరయ్యారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా ఇక్కడ వీరికి శిక్షణను ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న బుచ్చిరెడ్డి గత కొన్ని రోజులుగా సహచరులతో పాటు మామునూరులో శిక్షణ పొందుతున్నారు.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఫైరింగ్ లో తర్ఫీదు పొందుతున్న బుచ్చిరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ భానుడి ప్రతాపానికి తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకులాడు. దీంతో పక్కనే ఉన్న సహచర కానిస్టేబుళ్లు స్పందించి ఆసుపత్రికి తరలించేలోగానే ఆయన కన్నుమూశారు.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని రుద్రంపూర్ మండలం రామవరంలో నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ లారీని రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలపై పోనిచ్చాడు. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన లారీ బుధవారం రాత్రి ఆయిల్ లోడుతో రామవరం చేరుకుంది.
తెల్లవారుజామున అన్‌లోడ్ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ రోడ్డు పక్కనున్న దుకాణాలపైకి పోనిచ్చాడు. దీంతో అక్కడే పడుకున్న కాపలాదారు లక్ష్మీనారాయణ(54)పై పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
రెండు లారీలు ఢీకొని ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం రామకృష్ణాపూర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీలు ఢీకొట్టిన ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే చనిపోయారు. మొక్కజొన్నల లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications