షాదీ ముబారక్ అక్రమాలపై కేసీఆర్ ఆగ్రహం: ఒకరి అరెస్ట్
హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అవినీతి చోటు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలకు ఏసీబీ సిద్ధమైంది.
పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రతిష్టాత్మక పథకాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంపై సీఎం కెసిఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లబ్ధిదారు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసిన వ్యక్తి అరెస్ట్
షాదీ ముబారక్ స్కాంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని ఏసిబి డిజి ఏకే ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏసిబి, లాండ్ అండ్ ఆర్డర్ పోలీస్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఫౌజీయా బేగం అనే లబ్ధిదారు ఖాతా నుంచి రూ. 31వేలు డ్రా చేసిన రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫౌజియా బేగం ఫిర్యాదుతో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. తన ఖాతాలో రూ. 20వేలు మాత్రమే ఉండటంతో సంబంధిత వ్యక్తులను అడగ్గా అంతే మొత్తం వచ్చినట్లు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఫౌజియా బేగం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డిసిపి సత్యనారాయణ తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో నిందితులందర్నీ పట్టుకుంటామని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేసులు నమోదు
షాదీ ముబారక్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌లోనూ ఇటీవల సోదాలు జరిపి పలు ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన ఏసీబీ అధికారులు.. నిధుల విడుదలలో గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించారు.
ఈమేరకు తప్పుడు సమాచారంతో లబ్ధి పొందినవారు, సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో 3, నల్లగొండలో 2, మహబూబ్‌నగర్‌లో 4, ఆదిలాబాద్‌లో 2 కేసులతోపాటు ఇతర ప్రాంతాల్లో మరో 9 కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications