రెండేళ్ల కుమార్తెను చంపి.. దంపతుల ఆత్మహత్య.. హైదరాబాద్ KPHB కాలనీలో విషాదం
హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రెండేళ్ల కుమార్తెను చంపి ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఆ ఇంటి గోడ మీద సూసైడ్ నోట్ రాశారు. "మా చావుకు ఎవరూ కారణం కాదు. మేము చేసిన తప్పు ఏంటో మాకు తెలుసు. ఇలా చనిపోవడం తప్పే.. కానీ వేరే మార్గం లేదు. ఈ విషయంలో మా స్నేహితులు, బంధువులను వివరణ అడగకండి" అని రాసి ఉంది. ఇక ఈ ఘటనపై కేపీహెచ్ బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏదైనా ఫైనాన్షియల్ సమస్యలు.. లేదా ఆరోగ్య సమస్యల కారణంగా వీళ్లు మరణించారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు రాబట్టిన ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన గోపి, సమత దంపతులు. వీరు 2023 లో వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల స్నిగ్ధ అనే పాప ఉంది. ఉపాధి నిమిత్తం కొంత కాలం క్రితం వీళ్లు హైదరాబాద్ కు వచ్చి కేపీహెచ్ బీ కాలనీలోని మూడో ఫేజ్ లో నివాసం ఉంటున్నారు. అయితే సరైన ఉపాధి లేని కారణంగా వీరిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. గత కొంతకాలంగా వారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఇప్పటికే అనేక అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చే దారి లేక ఇక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తాము చనిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నట్లు దంపతులు తమ ఇంటి గోడపై రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో తొలుత రెండేళ్ల చిన్నారి స్నిగ్ధను దంపతులిద్దరూ ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే చనిపోవడానికి ముందు తమ ఇంటి గోడపై సూసైడ్ నోట్ రాశారు.తమ చావుకి ఎవరూ కారణం కాదని.. ఇతరులను వివరాలు కూడా అడగొద్దని రాశారు. చాలాకాలం క్రితమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తమ చావుకు ఎవరినీ బాధ్యులను చేయొద్దని పేర్కొన్నారు. ఇక స్థానికులు అందించిన సమాచారం మేరకు కేపీహెచ్ బీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications
