పత్రికల్లో వస్తే ఫిర్యాదా?: హైకోర్టులో బాబుకు ఊరట, మారిషస్ కేసులో సుజనకు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఎస్సీల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని, ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ప్రతాప్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది.
ఈ సందర్భంగా హైకోర్టు.. మీడియా వార్తల ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీసులకు చెప్పలేమంది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఏలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించింది. సొంత ప్రయోజనాల కోసం వ్యాజ్యం దాఖలు చేసినట్లుందని వ్యాఖ్యానించింది.
గత నెలలో చంద్రబాబు మీడియా సమావేశంలో.. ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు, అందరూ సంపన్నవర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారని వ్యాఖ్యానించి, ఎస్సీల మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడారని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు.

సుజనాకు ఊరట
మారిషస్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు కేసులో తాను కోర్టు ఎదుట హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ టిడిపి ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల మారిషస్ బ్యాంకు కేసులో సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు చెందిన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజనా, ఎండీ జీ శ్రీనివాస రాజు, డైరెక్టర్ హనుమంత రావు మార్చి 22వ తేదీ మంగళవారం కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించింది. దీనిపై వారు మినహాయింపు కోరారు.
సుజనా చౌదరి మినహా, మిగతా నిందితులు మంగళవారం కోర్టు ముందు హాజరయ్యారు. నిందితులుగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ జి శ్రీనివాసరాజు, డైరెక్టర్ ఎస్ హనుమంతరావులు హాజరయ్యారు.
సుజనా చౌదరి పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీలో ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉన్నందున కోర్టుకు రాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డానియల్ రూథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుజనాచౌదరి హాజరు మినహాయింపునకు అనుమతించారు.
సుజనా చౌదరితో సహా నిందితులంతా రూ.50 వేల చొప్పున రెండేసి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. తమకు హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ శ్రీనివాసరాజు, హనుమంతరావులు దాఖలుచేసిన పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications