తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: కొత్తగా 1078 కేసులు, 6మరణాలు -వ్యాక్సిన్ కోసం జనం పరుగులు -రద్దీ
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతూ ఇప్పుడది వెయ్యి మార్కును కూడా దాటేసింది. మహమ్మారి బారినపడిన చనిపోతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి భయానకంగా మారుతుండటంతో జనం కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లోని పలు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది..

వెయ్యికిపైగా కేసులు, 6మరణాలు
తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ వివరాల ప్రకారం.. శుక్రవారం 59,705 కరోనా పరీక్షలు నిర్వహించగా..1,078 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,10,819కు పెరిగింది. నిన్న ఒక్కరోజే మహమ్మారి కాటుకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 1712కు పెరిగింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.55 శాతం ఉంది.

ఈ ఏడాదిలో అత్యధికం..
ఒకే రోజు 1078 కొత్త కేసులు, 6 మరణాలు నమోదు కావడం ఈ ఏడాదిలోనే అత్యధికమని అధికారులు పేర్కొన్నారు. మొత్తం కేసులు 3,10,819కాగా, నిన్న ఒక్కరోజే 30 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో డిశ్చార్జీల సంఖ్య 3,02,207కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 97.22 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. కొత్త కేసులు విపరీతంగా వస్తుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 6,900కు పెరిగింది. వీరిలో 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక,

గ్రేటర్‌లో వేగంగా వ్యాప్తి
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తికి తొలి నుంచీ కేంద్రంగా ఉంటోన్న హైదరాబాద్ లో సెకండ్ వేవ్ కూడా ఉధృతంగా సాగుతోంది. గ్రేటర్ మైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో నిన్న ఒక్కరోజే కొత్తగా 283 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. సిటీలోనే కలిసుండే మేడ్చల్ జిల్లాలో కొత్తగా 113 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 104 కేసులు వచ్చాయి. నిజామాబాద్‌లో 75, నిర్మల్‌లో 40 , కరీంనగర్‌లో 34 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే,

వ్యాక్సిన్ సెంటర్ల వద్ద రద్దీ
ఏప్రిల్ 1(గురువారం) నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. దీంతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో వ్యాక్సిన్ వేసే ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. శనివారం ఆస్పత్రుల ఎదుట వ్యాక్సిన్ వేసుకునే వారు రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు భారీగా క్యూలో నిలబడ్డారు. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే వారు మొదట వెబ్‌సైట్‌లో తమ ఆధార్ నెంబర్‌తో పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలా సమయం పడుతోందని చెబుతున్నారు.

ఆదివారం కూడా వ్యాక్సినేషన్..
తెలంగాణ సహా దేశమంతటా కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,129 కొత్త కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి, మరణాల సంఖ్య 1,64,110కి పెరిగాయి. వైరల్ వ్యాప్తి ఉధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆదివారం కూడా ఆయా సెంటర్లలో వ్యాక్సిన్ల పంపిణీని కొనసాగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. తెలంగాణలోనూ ఈ ఆదివారం (ఏప్రిల్ 4న) వ్యాక్సినేషన్ ప్రక్రియ యధావిధిగా కొనసాగనుంది.












Click it and Unblock the Notifications