నేను తప్పతాగి చిందులేయలేదు: సిపిఐ నేత నారాయణ
హైదరాబాద్: నూతన సంవత్సర వేడకల్లో తాను మద్యం తాగి డ్యాన్స్ చేయలేదని సిపిఐ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు నారాయణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా డ్యాన్స్ చేశానే గాని తప్ప తాగి డ్యాన్స్ చేయలేదన్నారు.
తమ పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని, డ్యాన్స్ కూడా అందులో భాగమేనన్నారు. అలాగే ప్రజలతో మమేకం అయ్యేలా పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. మీడియాను ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు.

నూతన సంవత్సరం వేడుకల్లో బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసి నారాయణ అందరినీ అలరించిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో హుస్సేనసాగర్ బోట్‌లో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ ఆనందంతో చిందులు వేశారు.
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీగీతాలకు స్టెప్పులు వేస్తూ నారాయణ అందరినీ అలరించారు. చాడ వెంకటరెడ్డి నారాయణ డ్యాన్స్‌కు నవ్వుతూ కనిపించారు.
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఆర్భాటాలన్నీ గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications