పెళ్లాలకు, ఫిరాయింపులకు లింకేంటి?: పదవులపై నారాయణ
హైదరాబాద్: తెలంగాణను పరిపాలిస్తుంది ఫిరాయింపుదారులేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలోని ఏదులాపురంలో విలేకరులతో మాట్లాడారు. డబ్బు, పదవుల కోసం పార్టే వారికి పెళ్లాలకంటే పదవులంటేనే ప్రీతి అని అన్నారు.
ప్లీనరీ పేరుతో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొందరు అధికారులు రాజకీయ కార్యకర్తలుగా మారి ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు తొత్తులుగా మారి ఐఎఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయిలో ఉన్నవారు సైతం వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారని మండిపడ్డారు.
పాలేరు ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చి, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఖమ్మంలో టీఆర్‌ఎస్ నేతలు ప్లీనరీ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు, కొండా దంపతులు తదితరులను అందలం ఎక్కిస్తున్నారని, ఉద్యమంలో పాల్గొన్న వారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదని, ఫిరాయింపుదారుల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రజలకంటే వారసులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో చంద్రబాబు.. అలాగే ములాయం, లాలు తదితరులు కొడుకులకు ఆస్తులు, పదవులు కట్టబెట్టడానికే విలువనిస్తున్నారని ఆరోపించారు.
ఇక కేంద్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం న్యాయ, రాజ్యాంగ వ్యవస్థను ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. వెంకయ్యకు ప్రధాని మోడీ దేవుడిలాకనిపిస్తున్నాడని, ప్రజలకు మాత్రం దెయ్యంలా కనిపిస్తున్నారన్నారని ఎద్దేవా చేసారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద కరువు ఈఏడాది వచ్చిందదని కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యంగా ఉన్నాయని అన్నారు. పాలేరులో సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌కు సీపీఐ మద్దతునిస్తుందని, న్యూడెమోక్రసీ సైతం మద్దతివ్వాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications