నాగార్జున.. కక్కుర్తి ఎందుకు?: నారాయణ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తుమ్మిడి చెరువును ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలతో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారుకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. అక్రమాలను కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ తెలిపారు. మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారని అన్నారు. నాగార్జున బిగ్ బాస్‌కే బాస్. చెరువుని ఆక్రమించుకుని కబ్జాలు చేశారని విమర్శించారు.

నాగార్జున ఏం సత్యహరిశ్చంద్రుడు కాదన్నారు నారాయణ.ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు రూ. లక్షల ఆదాయం వస్తోందన్నారు. చాలా డబ్బులు ఉన్నాయి.. ఆయనకు ఇదంతా లెక్క కాదు. సినిమా డైలాగులు పనికి రావు. ఒక్కటే కూర్చుని వందమందిని కొట్టేస్తే కుదరు. రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలి అని నారాయణ ఘాటుగా స్పందించారు.
నాగార్జున మంచి నటుడే కానీ.. ఈ కక్కుర్తి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా బుకాయింపు మాటలు మాని.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నాగార్జునను నారాయణ డిమాండ్ చేశారు. ఆక్రమణలకు పాల్పడిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కారును కోరారు.
బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారని.. వారంతా కబ్జా కోరులని ఆరోపించారు నారాయణ. ఫిరంగి నాలాను కబ్జా చేశారన్నారు. చెరువులు, నాలాలు కబ్జాలు అయితే ఊర్లు మునిగిపోతాయన్నారు. ఆరంభ శూరత్వం కాదు.. ఎక్కడ కబ్జా జరిగిన ఖాళీ చేయించాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.
రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదన్నారు నారాయణ. ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలన్నారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం వాళ్లు ఎక్కువగా ఆక్రమణలు చేశారని, వారికి కూడా తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారో వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications