పాల పిట్టలను బంధిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ
ఏటా వచ్చే విజయదశమిని సమస్త విజయాలకు ప్రతీకగా భావిస్తుంటారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజించి.. దశమినాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధన చేస్తారు. ఇక దసరా నాడు సీమోల్లంఘనం చేసి (గ్రామ శివారు దాటి) ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా భావిస్తారు. నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో సౌందర్యంగా ఉండే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. అటు త్రేతాయుగంలో శ్రీ రాముడికి.. ద్వాపరయుగంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తుంటారు.
అయితే ప్రస్తుతం పాల పిట్టలు అరుదుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో చాలామంది పాలపిట్టను బోనుల్లో బంధించి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో పాలపిట్టను బంధించినా.. విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. దసరా సందర్భంగా పాల పిట్టలను బోనుల్లో బంధించి విక్రయించే వారిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"పండుగ అంటేనే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడం. కానీ, దసరా వేళ శుభం అంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి, బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారని వీసీ సజ్జనార్ మండిపడ్డారు. ఆలోచించండి.. ఒక మూగజీవి స్వేచ్ఛను హరించి, దానికి ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ చూస్తే ఎవరికైనా మేలు ఎలా జరుగుతుంది..? ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది..? అని తెలిపారు. పాలపిట్ట మన పర్యావరణానికి రక్షకుడు, రైతుకు మేలు చేసే నిజమైన నేస్తం. అది నీలాకాశంలో స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం, మన సమాజానికి గౌరవం.. అని స్పష్టం చేశారు.

ఇక వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం నేరమని.. ఈ పండుగ పూట మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిద్దాం.. బంధించిన పక్షుల ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకండి.. అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించండి.. అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
