Cyclone Arnab: అతి తీవ్ర తుపానుగా 'అర్నబ్'.. తెలంగాణకు రెడ్ అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే కీలక విజ్ఞప్తి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అర్నబ్' అతి తీవ్ర తుపానుగా మారి తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనించిన ఈ తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కి మీ దూరంలో.. అలాగే కాకినాడకు 180 కి మీ దూరంలో.. మచిలీపట్నానికి 270 కి మీ దూరంలో ఇక బాపట్లకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అర్నబ్ తుపాను కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం సన్నద్ధమైంది.
అర్నబ్ తుపాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు ప్రాంతాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికుల భద్రత, రైలు నిర్వహణ దృష్ట్యా పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని రైళ్ల నడిపే సరళిలో మార్పులు చేసేంది దక్షిణ మధ్య రైల్వే. అర్నబ్ తుపాను అక్టోబర్ 28 వ తేదీ ఉదయం అతి తీవ్రమైన తుపానుగా బాపట్ల, విశాఖపట్నం (యానాం సమీపంలో) మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ అక్టోబర్ 28 వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అలాగే అక్టోబర్ 28, 29 తేదీలలో వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఈ మార్గాల్లో / సెక్షన్లలో ప్రయాణించే అనేక రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ అలాగే ఇతర సంబంధిత అధికారులతో భద్రతా చర్యలు, ముందస్తు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలు, వంతెనలను, ఆయా ప్రదేశాలలో చేపడుతున్న గస్తీ ఏర్పాట్లు, పెట్రోల్ మెన్, వాచ్ మెన్ ల నియమకాన్ని, చెరువు నీటి మట్టాల స్థితిని కూడా సమీక్షించారు. అలాగే కాజీపేట, డోర్నకల్ వద్ద బండరాళ్లు, ఇసుక సంచులు, కంకర రేక్ లతో పాటు ప్రమాద సహాయక రైళ్లు (ఏఆర్టిఎస్), ప్రమాద సహాయక వైద్య పరికరాల (ఏఆర్ఎమ్ఈఎస్ లు) సంసిద్ధత, వాటి మోహరింపును కూడా సమీక్షించారు.
ప్రయాణికులు, సిబ్బంది, రైల్వే ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి, అన్ని విభాగాల అధిపతులు, ముఖ్యంగా- ఆపరేటింగ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాల అధిపతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు. డివిజనల్, ప్రధాన కార్యాలయ స్థాయిలలోని అధికారులు, సీనియర్ సూపర్‌వైజర్లు రైలు కార్యకలాపాలను, వంతెనల పరిస్థితిని మరియు ప్రమాదకర ప్రదేశాలలో నీటి మట్టాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, రైలు ప్రయాణికులు ఈ క్రింది విషయాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు.. రైలు ప్రయాణికులు భారీ వర్షాలు, తుపాను పరిస్థితులు వంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ రైలు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పునఃప్రణాళిక మొదలైన రైలు సేవల విధానంలో మార్పులకు సంబందించిన సమాచారాన్ని రిజర్వ్డ్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ఇచ్చిన ప్రయాణికుల మొబైల్ నంబర్లకు ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

రైలు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, ఐఆర్సీటీసీ, రైల్ వన్, ఎన్టీఈఎస్ మొదలైన అధికారిక రైల్వే అప్లికేషన్లు/వెబ్ సైట్ ల నుండి రైళ్ల ప్రస్తుత స్థితిని సరిచూసుకోవచ్చు లేదా సరైన సమాచారం కోసం 139 విచారణ నంబర్‌కు డయల్ చేయవచ్చు. రైలు సర్వీసుల సరళిలో మార్పును ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా క్రమం తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. రైళ్ల రద్దు/పాక్షిక రద్దు/దారి మళ్లింపు/పునఃప్రణాళికకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులు X (SCRailwayIndia), ఫేస్ బుక్(South Central Railway-SCR),ఇన్ స్టాగ్రామ్ (@scrailwayindia) వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో లేదా దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్( https://scr.indianrailways.gov.in/index.jsp?lang=0 ) లో కూడా పొందవచ్చు.












Click it and Unblock the Notifications
