కాంగ్రెస్‌లో: ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్న దానం, కుట్ర చేస్తున్నారని షబ్బీర్
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తున్నారు! తాను అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని ఆయన శుక్రవారం నాడు తెలిపారు. దానం కారు ఎక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మధ్యాహ్నం దానం ఇంటికి వెళ్లారు. ఆయనతో కాసేపు రహస్యంగా మాట్లాడారు. అనంతరం ఇరువురు బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా దానం మాట్లాడారు. తాను తన అనుచరులతో భేటీ కావడంలో తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే తాను భేటీ అవుతున్నానని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తెలిపారు.

ఈ సందర్భంగా మీడియా... మీరు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయన అనుచరులు జై దానం అంటూ నినాదాలు చేశారు. ఆయన అక్కడి నుంచి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ... దానం నాగేందర్ పైన కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఆయన కరడుగట్టిన కాంగ్రెస్ వాది అన్నారు. ఆయనకు గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాగా, షబ్బీర్ అలీతో భేటీ అనంతరం దానం చల్లబడినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, రంగారెడ్డి, హైదరాబాద్‌ను కలిపి తనను అధ్యక్షుడిగా చేయాలని దానం డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా నేతలు మాత్రం హైదరాబాద్ నుంచి విడదీసి తమకు కొత్త అధ్యక్షుడిని పెట్టాలని చెబుతున్నారు. దీనిపై దానంకు లభించే హామీ పైన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే విషయం తేలుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications