కేసీఆర్ 'ఆంధ్రా' వ్యాఖ్యాలు 'గ్రేటర్' కోసమా?
హైదరాబాద్: నగరంలోని ఆంధ్రా వాళ్లు తమ బిడ్డలేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని పైన వివిధ రకాల చర్చ సాగుతోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయని, అందుకే కేసీఆర్ ఆ ప్రేమ కురిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం గ్రేటర్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డిలు తెరాసలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాదులోని ఆంధ్రా వాళ్లు తమ బిడ్డలేనని, ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దీని పైన ఓ ఆంధ్రా మంత్రి కూడా స్పందించారట. హైదరాబాదులో గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయంటున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారట! నిన్నమొన్నటిదాకా ఆంధ్రా వారిని తిట్టిన కేసీఆర్, హఠాత్తుగా ఇంత ప్రేమ కురిపించడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఓ మంత్రి సమావేశంలో అన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
'గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పుడు కేసీఆర్ నోటి నుంచి అలాంటి మాటలే వస్తాయని మరో మంత్రి సమాధానమిచ్చారట. కాగా, త్వరలో గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోసం తెరాస ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. అదే సమయంలో ఆంధ్రా వారి ఓటర్లను పొందేందుకు కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు.












Click it and Unblock the Notifications