హైదరాబాద్‌లో కేజ్రీవాల్ ప్రత్యక్షం- కేసీఆర్‌తో కీలక భేటీ
హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్- ఇవ్వాళ హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను కలుసుకుంటోన్నారు. వారి నుంచి మద్దతును కోరుకుంటోన్నారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకుని వస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాదలిచిన ఆర్డినెన్స్‌ను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలనేది ఆయన వాదన.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను మరింత కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా.. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే అధికారాలను మరింత కోత పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూ కేటాయింపులు మినహా మిగిలిన అన్ని సేవలపైనా నియంత్రణకు పూనుకుంది.

ఇందులో భాగంగా- నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. తమ ప్రభుత్వ అధికారాలకు మరింత కోత పెడుతూ ఆర్డినెన్స్‌ను తీసుకుని రావాలని ప్రతిపాదించింది. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. దీన్ని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను కలుస్తోన్నారు. సమాఖ్య విలువలను కేంద్రం కాలరాస్తోందంటూ మండిపడుతున్నారు.
ప్రతిపక్ష నేతలను ఏకం చేయడంలో భాగంగా కేజ్రీవాల్.. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వంటి నాయకులను కలిశారు. వారితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్డినెన్స్ వల్ల సంభవించబోయే అనర్థాల గురించి వారికి వివరించారు.
ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయ్యారు.. అరవింద్ కేజ్రీవాల్. భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఆయనతో భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత కేజ్రీవాల్ - హైదరాబాద్‌కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత మాన్ కొద్దిసేపటి కిందటే ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ నామా నాగేశ్వర రావు, ఖమ్మం లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వర రావు పలువురు బీఆర్ఎస్ నాయకులు వారిని సాదరంగా స్వాగతించారు. అనంతరం ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. కేంద్రం ఆర్డినెన్స్ ఎంత ప్రమాదకరమో వివరించారు. దాని వల్ల ఫెడరల్ వ్యవస్థ ధ్వంసమౌతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications