అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆఫీస్ కు రానివ్వని టీసీఎస్ హైదరాబాద్
హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్లలో గల టీసీఎస్ క్యాంపస్ వద్ద కలకలం రేగింది. అయ్యప్ప దీక్ష స్వీకరించిన ఓ టెక్కీని ఆఫీస్ లోనికి రానివ్వలేదు సంస్థ యాజమాన్యం. విధులకు హాజరు కావడానికి అనుమతించలేదు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల ప్రతినిధులు టీసీఎస్ కార్యాలయం వద్ద గుమిగూడారు. ధర్నాకు దిగారు. టీసీఎస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఆ టెక్కీ పేరు.. మనీష్. రెండు సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా టీసీఎస్ లో పనిచేస్తోన్నాడు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అతను శబరిమల యాత్ర కోసం అయ్యప్ప మండల దీక్షను స్వీకరించాడు. నల్లటి దీక్షా వస్త్రాలు, మాల ధరించి ఆఫీసుకు వెళ్లాడు. అతన్ని సెక్యూరిటీ సిబ్బంది గేట్ వద్దే నిలిపివేశారు. అయ్యప్ప మాల ధరించి ఆఫీస్ కు రావడం, నలుపు దుస్తులు ధరించడం అనేది డ్రెస్ కోడ్ నిబంధనలకు విరుద్ధం అంటూ అడ్డుకున్నారు. లోనికి వెళ్లడానికి అనుమతించలేదు.

దీనిపై మనీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. డ్రెస్ కోడ్ పాటించని ఇతర ఉద్యోగులకు విధులకు హాజరు కావడానికి యాజమాన్యం అనుమతి ఇస్తోందనే విషయాన్ని గుర్తు చేశాడు. అయ్యప్ప మాల ధరించాననే కారణంతోనే తనను అడ్డుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను దీక్ష స్వీకరించబోతున్న విషయాన్ని రెండు నెలల కిందటే కంపెనీ యాజమాన్యానికి తెలియజేశాననీ, అయినప్పటికీ చివరి నిమిషంలో లోపలికి రానివ్వకపోవడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావట్లేదని వాపోయాడు.
ఈ విషయం తెలియడంతో అయ్యప్ప భక్తులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో టీసీఎస్ ఆదిభట్ల క్యాంపస్ వద్దకు చేరుకున్నారు. సంస్థ యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. టెక్ ఇండస్ట్రీలో మతపరమైన ఆచార వ్యవహారాలు, భక్తుల నమ్మకాలను గౌరవించాల్సిన బాధ్యత సంస్థ యాజమాన్యాలపై ఉందని పేర్కొన్నారు. దీక్షా దుస్తుల్లోనే ఉద్యోగిని సదరు ప్రాంగణంలో పనిచేసుకోవడానికి వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
An employee wearing Ayyappa Mala was reportedly denied entry into the TCS office at Adibatla, Hyderabad, by his manager.Faith and devotion deserve respect. No employee should be made to feel uncomfortable for following their religious traditions 🙏 https://t.co/GUc65LcsoK
— Bujji kanna 😼💖 (@bujji_kannna) November 20, 2026
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. టీసీఎస్ ప్రతినిధులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనపై బాధితుడి నుంచి లేదా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, ఈ ఘటన పూర్వాపరాల గురించి అడిగి తెలుసుకుంటోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications
