భట్టి బడ్జెట్ తో ఉద్యోగులకు దక్కిందేంటి..!!
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. ఆరు గ్యారెంటీల అమలుకు మొత్తం రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, సన్న వడ్లకు కేటాయింపులు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగులు.. పెన్షనర్ల సంబంధించి భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకం గా ప్రస్తావన చేసారు. తమ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ రూ.3,24,234 కోట్లు గా ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు గా పేర్కొన్నారు.

తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు కాగా, ఇక వృద్ధి రేటు 10.2శాతం గా వెల్లడించారు. ఈ బడ్జెట్ లో కొత్త పెన్షన్ల పైన ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం ప్రతీ ఇంటికి భీమా పథకం ప్రకటించారు. విద్యార్ధులకు కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఉద్యోగుల విషయం ప్రస్తావన చేసిన భట్టి.. వారికి అందిస్తున్న ఆరోగ్య భరోసా కే పరిమితం అయ్యారు. కొత్త పీఆర్సీ, ఐఆర్ ప్రస్తావన చేయలేదు.
ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ ఊసే లేని బడ్జెట్
కాగా, భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రారంభిస్తున్న ట్లుగా వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు భద్రతా భరోసా కల్పిస్తున్నామన్నారు. ఈ నగదు రహిత పథకాన్ని రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తంగా 1998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్స అందుతుందని చెప్పారు. ఇక.. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తామన్నారు. 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన ర్లు, కుటుంబ సభ్యులకు లబ్ది కలుగుతుందని వివరించారు.
దేశంలోనే తొలి సారిగా సమగ్ర ప్రమాద పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవ శాత్తూ మరణిస్తే 1.20 కోటి అందుతుందని వివరించారు. విమాన ప్రమాదంలో మరణిస్తే అదనంగా రూ 2 కోట్లు అందుతాయని చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లుకు ప్రయోజనాలు అందిస్తామని ప్రకటించారు. అయితే.. ఉద్యోగులు ఈ బడ్జెట్ ప్రసంగంలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు పైన ప్రకటన.. ఐఆర్ పైన నిర్ణయం ఉంటుందని ఆశించారు. ఆ ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications