తండ్రి కిడ్నీ కోసం.. అండాల్ని అమ్ముకున్న యువతి కథ! ఐవీఎఫ్ రాకెట్ నలిపిన జీవితాలు..
అప్పుల బాధలు, ఇంట్లో అనారోగ్య సమస్యలు, తిండికి కూడా లేని దుస్థితి.. ఈ పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మోసగాళ్లు సాగిస్తున్న అక్రమ దందా పోలీసుల రైడ్స్‌తో ఒక్కసారిగా బట్టబయలైంది. భాగ్యనగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ ఓసైట్ (అండం) సేకరణ రాకెట్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కుటుంబాలను గట్టెక్కించాలనే ఆశతో నగరానికి వచ్చిన అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా నడుపుతున్న వైనం పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
మల్కాజ్‌గిరి పోలీసులు నగరంలోని ప్రకాశ్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాల్‌పురం తదితర ప్రాంతాలపై ఒకే టైంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిర్బంధించి అండాలను సేకరిస్తున్న ఒక చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించారు. వివిధ రాష్ట్రాల నుంచి మోసపోయి వచ్చిన 43 మంది మహిళలను సురక్షితంగా రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ దందా వెనుక సుమారు 23 ఐవీఎఫ్ కేంద్రాల ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలతో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి కిడ్నీ మార్పిడి కోసం వచ్చి..
కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల యువతి ఉదంతం కంటతడి పెట్టిస్తోంది. ఆమె తండ్రి కిడ్నీలు ఫెయిల్ కావడంతో వైద్యం కోసం కుటుంబం రూ. 3.5 లక్షలు అప్పు చేసింది. రోజువారీ కూలీ అయిన తల్లి, చదువుకుంటున్న నలుగురు తోబుట్టువులతో కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి రూ. 50 వేల సంపాదన ఆశతో హైదరాబాద్‌కు వచ్చిన ఆ యువతికి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలిసి కాళ్లావేళ్లా పడింది. హాస్టల్స్‌లో ఉంచి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆమె కన్నీరుమున్నీరవుతోంది.
నకిలీ గుర్తింపు కార్డులు, అపార్ట్‌మెంట్లు, విల్లాలే అడ్డాలుగా..
ఈ రాకెట్‌ను నడిపిస్తున్న ముఠా అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ వంటి వివిధ రాష్ట్రాల నుంచి నిరుపేద మహిళలను టార్గెట్ చేసి నగరానికి రప్పించారు. విల్లాల్లో, మహిళా హాస్టల్స్‌లో తలదాచుకునేలా చేసి వారికి రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అమిత్ శర్మతో పాటు నిఖత్ పర్వీన్, రేష్మా ఖాటూన్ సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఏకంగా 100 నకిలీ ఆధార్ కార్డులు బయటపడటం ఈ నేరం తీవ్రతకు అద్దం పడుతోంది.
కన్నీళ్లతో గడుపుతున్న దయనీయ స్థితి
పునరావాస కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరి వెనుకా ఒక కన్నీటి కథే ఉంది. భర్తకు యాక్సిడెంట్ జరిగి మంచాన పడటంతో కుటుంబ భారాన్ని మోస్తున్న ముంబై మహిళ కావచ్చు, కనీసం పిల్లలకు తిండి పెట్టలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్న యూపీ కుటుంబం కావచ్చు.. అందరినీ దళారులు అవే ఆర్థిక సమస్యలతో మోసగించారు. దీపావళిని కన్నీళ్లతో గడిపిన ఈ బాధితులు, తమ ఇళ్లకు ఎప్పుడు వెళ్తామా అని ఎదురుచూస్తున్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం వీరందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
చట్టం ఏం చెబుతోంది?.. కఠిన నిబంధనలు బేఖాతరు
అసిస్టెంటెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం-2021 ప్రకారం మానవ అండాల విక్రయం లేదా బదిలీ పూర్తిగా నేరం. డోనర్ వయస్సు 23 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, జీవితంలో ఒక్కసారి మాత్రమే ఏడు అండాలకు మించకుండా దానం చేయడానికి నిబంధనలు అనుమతిస్తాయి. అంతేకాకుండా ఆపరేషన్ అనంతరం ఆరోగ్య సమస్యల కోసం 12 నెలల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అందించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, పేదరికమే పెట్టుబడిగా ఈ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది.














Click it and Unblock the Notifications
