దిల్ రాజు రాజీ ఫార్ములా - "మెగా" ప్లాన్, తగ్గాల్సిందే..!!
తెలంగాణ ప్రభుత్వం - అల్లు అర్జున్ వివాదానికి ముగింపు పలికేందుకు దిల్ రాజు రంగంలోకి దిగారు. ప్రముఖ నిర్మాతగా .. ఎఫ్డీసీ ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఇందుకోసం రాజీ ఫార్ములా సిద్దం చేసారు. అమెరికా నుంచి వస్తూనే సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఆయన మూడ్ గుర్తించారు. ఇటు టాలీవుడ్ పెద్దలతోనూ చర్చలు చేస్తున్నారు. బెనిఫిట్ షో .. టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సంక్రాంతి సినిమాలకు నష్టంగా గుర్తించారు. దిల్ రాజు మెగా ప్లాన్ తో సిద్దమయ్యారు. సినీ పెద్దలు రాజీ కోసం తగ్గాల్సిందేనని ముఖ్యులు తేల్చి చెబుతున్నారు.
సంక్రాంతి టెన్షన్
తెలుగు సినీ పెద్ద హీరోలకు సంక్రాంతి టెన్షన్ పట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ వివాదంలో బెనిఫిట్ షో .. టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించింది. ఈ సంక్రాంతికి ప్రముఖ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు సినిమాల్లో మూడు దిల్ రాజుకి చెందినవే కావడం విశేషం. 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలకు ఆయనే నిర్మాత. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. దీంతో, ఇప్పుడు ఈ పరిశ్రమ సమస్యను పరిష్కరించే బాధ్యత దిల్ రాజు తీసుకున్నారు. మెగా, అల్లు కుటుంబంతోనూ దిల్ రాజుకు సత్సంబంధాలు ఉన్నాయి.

దిల్ రాజు సమన్వయం
ఆస్పత్రికి వచ్చి వచ్చి శ్రీతేజ్ ను పరామర్శించిన దిల్ రాజు...రేవతి భర్తకు తమ సినిమా ఇండ్రస్ట్రీ లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ బెయిల్ పై నుంచి విడుదలయిన తర్వాత ఇంటికి వెళ్లి దిల్ రాజు పరామర్శించారు. అటు సీఎం రేవంత్ తోనూ ఈ వివాదం పై ఇప్పటికే దిల్ రాజు మాట్లాడారు. రేవంత్ ఏం కోరుకుంటున్నారో గుర్తించారు. దీంతో, సినీ ప్రముఖులతో భేటీకి దిల్ రాజు సిద్దమయ్యారు. టాలీవుడ్ తో భేటీలో ప్రభుత్వం సినీ పరిశ్రమ ఎలా వ్యవహరించాలని కోరుకుంటుందో వివరించనున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కేంద్రంగా ఉండటం తో పాటుగా తెలంగాణ పెద్ద మార్కెట్ గా ఉంది.
రేవంత్ నిర్ణయం ఏంటి
దీంతో, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చేలా సినీ పెద్దలను దిల్ రాజు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దిల్ రాజు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ లో భాగంగా సినీ పెద్దలు ముందుగా దిల్ రాజు తో.. ఆ తరువాత సీఎం తో భేటీ అయ్యేలా స్కెచ్ సిద్దం అవుతోంది. ముఖ్యమంత్రితో భేటీ వేళ అవసరమైతే తగ్గి.. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చేందు కు రెడీ అవుతున్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చేసిన బెనిఫిట్ షో .. టికెట్ ధరల పెంపు రద్దు నిర్ణయాల పై వెసులుబాటు కోరనున్నారు. దీంతో, దిల్ రాజు రాజీ ఫార్ములా కు ..సినీ ఇండస్ట్రీ తో చర్చలతో పాటుగా బెనిఫిట్ షో - టికెట్ ధరల పెంపు పైన పునరాలోచన చేయాలనే టాలీవుడ్ అభ్యర్ధనల పై రేవంత్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications