25ఏళ్ళుగా వేపచెట్టు కోసం గొడవ.. ఇద్దరి దారుణ హత్య!
సమాజంలో రోజురోజుకీ దారుణ ఘటనలు పెరిగిపోతున్నాయి. మనుషుల్లో సహనం నశించి తమకు తెలీకుండానే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. నిండు ప్రాణాలు తీయటమే కాక వారి జీవితాలకు నేరస్తులుగా శిక్ష వేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే హత్యల దాకా వెళ్లి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది.
వేప చెట్టు విషయంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న గొడవ
తాజాగా అటువంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి సరిహద్దులో ఉన్న ఒక వేప చెట్టు విషయంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న గొడవ ఇద్దరి హత్యలకు దారితీసింది. చిన్న విషయాలపై గొడవలు పెద్ద దుర్ఘటనలుగా మారుతున్న విషాదానికి ఇది మరో ఉదాహరణగా మారింది.

వేప చెట్టు నరికించటంతో ముదిరిన వివాదం
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య వేపచెట్టు విషయంలో ఏళ్ల తరబడి వైరం ఉంది. 25 సంవత్సరాలుగా రెండు కుటుంబాలు చెట్టు కోసం గొడవ పడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం వెంకటేశ్వర్లు కొంతమందిని పిలిచి వేప చెట్టును నరికించారు. దీన్ని గమనించిన భూక్యా సైదా కుమారుడు రాము అక్కడికి వచ్చి ప్రశ్నించాడు.
గొడ్డలితో దాడి.. రెండు కుటుంబాలలో ఇద్దరు మృతి, విషాదం
గొడవ పెద్దదై రాము గొడ్డలితో దాడి చేయడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన తండ్రి సైదాపై కూడా రాము దాడి చేయడంతో సైదా కూడా మరణించాడు. కేసును పక్కదారి పట్టించేందుకు తండ్రిని కూడా చంపాడని స్థానికులు చెబుతున్నారు. ఘటన తెలిసి గ్రామస్థులు రాము ఇంటిపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
చిన్న చిన్న విషయాలపై హత్యలకు పాల్పడితే కుటుంబాలు చిన్నాభిన్నం
ఈ క్రమంలో మేళ్లచెరువు ఎస్ఐ నవీన్ కుమార్ తలకు గాయాలయ్యాయి. ఆయనను హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రామును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇక దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. చిన్న చిన్న విషయాలపై గొడవలు పెంచుకుని హత్యలకు దిగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ ఘటన రెండు కుటుంబాలలో విషాదం నింపగా, హత్యకు పాల్పడిన వ్యక్తి జీవితం జైలు పాలయ్యింది.












Click it and Unblock the Notifications