యజమాని కారు ఎత్తుకెళ్లి షికార్లు కొట్టి ముంబైకి పరారయ్యాడు
హైదరాబాద్: కారు సరదా ఓ వ్యక్తిని కటకటాల పాలు చేసింది. ఆడి కారులో షికార్లు కొట్టాలనే అతను తన కోరిక తీర్చుకుని చివరకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో సయ్యద్ నగర్‌లో నివసించే ఎండి నజీర్ (28)కు ఆడి కారులో తిరగాలనే కోరిక బలంగా ఉండేది.
రెండు నెలల క్రితం అతను స్థానికంగా నివసించే రస్సెల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అధినేత రస్సెల్స్ జహీర్ వద్ద కారు డ్రైవరుగా చేరాడు. గత నెల 12వ తేదీన యజమానికి చెప్పకుండా కారును ఎత్తుకుపోయాడు. దీంతో కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన మూడు రోజులకు కారును శంషాబాద్ విమానాశ్రయం పార్కింగ్ ప్లేస్‌లో గుర్తించారు. నిందితుడు ముంబైకి పరారయ్యాడు. అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. తనకు ఆడి కారులో తిరగాలనే కోరిక ఉండేదని, రాత్రిపూట పివిఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై షికార్లు కొట్టాలని ఉండేదని, అందుకే కారును ఎత్తుకెళ్లానని అతను పోలీసులకు చెప్పాడు.
కారును ఎత్తుకెళ్లిన తర్వాత రెండు రోజులపాటు అర్థరాత్రి విమానాశ్రయం వరకు షికార్లు కొట్టానని, విమానాశ్రయానికి వెళ్లేవాళ్లకు షేరింగ్ ఇవ్వడం ద్వారా డీజిల్ ఖర్చులు సంపాదించానని అతను చెప్పాడు. అయితే, డబ్బులు సరిపోకపోవడంతో కారను వదిలేశానని చెప్పాడు. నజీర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications