అయ్యప్ప మాలధారునికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. షాకిచ్చిన స్వాములు!
మాల ధారణం.. నియమాల తోరణం అంటారు. అయ్యప్ప స్వామి మాల అంత పవిత్రమైనది. నియమ నిష్టలతో కూడుకున్నది. అటువంటి అయ్యప్ప స్వామి మాలధారులు ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అయ్యప్ప స్వామి మాల వేసుకుని మాలధారులు ఆందోళనలు చేయడం ఏమిటి అని స్థానికులంతా అసలు ఏం జరిగింది అనేది కనుక్కునే ప్రయత్నం చేశారు.
అయ్యప్ప మాల వేసుకున్న స్వామికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్
అయితే ఓ అయ్యప్ప స్వామి మాలధారునికి జరిగిన అవమానమే అందుకు కారణమని తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించి డ్రైవర్ గా పనిచేస్తున్న ఉద్యోగి నాగరాజు ఎప్పటిలానే నేడు కూడా విధులకు వెళ్లారు. రోజువారి లానే నేడు కూడా ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు.

ఆర్టీసీ డిపో ముందు అయ్యప్ప స్వాముల ధర్నా
అయితే తాను అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్నానని, తనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయవద్దని డ్రైవర్ నాగరాజు ఎంత చెప్పినప్పటికీ ఆర్టీసీ అధికారులు వినిపించుకోకుండా స్వామి మాల ధరించిన నాగరాజుకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన అయ్యప్ప స్వామి మాలధారులు అయ్యప్ప స్వామి భక్తి మండలి ఆధ్వర్యంలో తొర్రూరు ఆర్టీసీ డిపో ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
అయ్యప్ప స్వామిని అవమానించారని ఆందోళన
అయ్యప్ప స్వామి మాల ధరించిన నాగరాజు స్వామికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యతో హిందుత్వాన్ని, అయ్యప్ప స్వామిని అవమానించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి మాల వేసుకున్నప్పుడు నియమనిష్టలతో ప్రవర్తిస్తారనే విషయం అధికారులకు తెలియదా అంటూ వారు ప్రశ్నించారు .
క్షమాపణ చెప్పాలని డిమాండ్.. డిపో మేనేజర్ ఏం చేశారంటే
తక్షణం అయ్యప్ప స్వామిని అవమానించిన అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తొర్రూరు పట్టణ కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ తరువాత ఆర్టీసీ డిపో మేనేజర్ ఆందోళన చేస్తున్న అయ్యప్ప స్వాముల వద్దకు వచ్చి ఈ విషయంలో క్షమాపణ కోరారు. దీంతో అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించి వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications