రైతులకు షాక్.. . పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు!
జూన్ నెల చివరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో వానల ఊసే లేకుండా పోయింది. నైరుతి రుతుపవనాలు జూన్ 8నే రాష్ట్రాన్ని తాకినప్పటికీ.. గత పది రోజులుగా ఆశించినంత ముందుకు కదలడం లేదు. ఫలితంగా తెలంగాణలోని 429 మండలాల్లోకి రుతుపవనాలు ఇంకా విస్తరించలేదు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా వాతావరణాన్ని శాసిస్తున్న 'ఎల్ నినో' (El Nino) ప్రభావమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా సూర్యుడు ఇంకా నిప్పులు చెరుగుతుండటంతో వడగాలులు కొనసాగుతున్నాయి. దుక్కులు సిద్ధం చేసుకున్న రైతాంగం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తోంది.
25 జిల్లాల్లో లోటు వర్షపాతం.. పెద్దపల్లిలో అత్యధికం
సాధారణంగా జూన్ రెండో వారం ముగిసేసరికి వానలు పుంజుకుంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 19 నాటికి రాష్ట్రంలో 76.3 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 54.6 మి.మీ. మాత్రమే కురిసింది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 28 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. మొత్తం 25 జిల్లాల్లో ఈ లోటు స్పష్టంగా కనిపిస్తుండగా.. 11 జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 74 శాతం లోటు నమోదైంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 70 శాతం, సిద్దిపేటలో 64 శాతం చొప్పున వర్షపాతం పడిపోయింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ వంటి కొన్ని జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

జులై మినహా.. మిగతా నెలల్లో గండమే!
భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం.. ఈ ఏడాది వానాకాలం సీజన్ మొత్తం మీద తెలంగాణలో 20 శాతం లోటు తప్పేలా లేదు. ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే నెలల్లో వర్షాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. రాష్ట్రాన్ని కాస్తో కూస్తో ఆదుకునేది జులై నెల ఒక్కటేనని అధికారులు చెబుతున్నారు. జులైలో వర్షాలు కొంతమేరకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. కీలకమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మళ్లీ తీవ్రమైన లోటు ఏర్పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, గద్వాల, నాగర్‌కర్నూల్ వంటి పరిసర జిల్లాల్లో ఏకంగా 30 శాతం వరకు వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురవాల్సిన సగటు వర్షపాతాలు ఎల్ నినో దెబ్బకు తలకిందులయ్యే ప్రమాదం కనిపిస్తుండటంతో, ఈసారి వానాకాలం సాగుపై రైతులు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.














Click it and Unblock the Notifications